లైంగికదాడి బాధితురాలికి రిమాండ్

బీహార్ లో లైంగికదాడి బాధితురాలికి రిమాండ్ విధించారు. బాధితురాలికి రిమాండ్ విధించడం పట్ల 376 మంది న్యాయవాదులు స్పందించారు. ఇది హేయమైన చర్య అంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. బీహార్‌లోని అరారియా ప్రాంతానికి చెందిన 22 ఏండ్ల యువతి ఈ నెల 6న స్కూటర్ నేర్చుకునేందుకు తెలిసిన వ్యక్తితో వెళ్లింది. అయితే అతడి నలుగురు స్నేహితులు ఆమెను నిర్బంధించి సామూహిక లైంగికదాడి చేశారు.
అనంతరం ఆ యువతి అచేతనంగా పడి ఉండటాన్ని జన జగ్రాన్ శక్తి సంస్థాన్ కార్యకర్తలు చూసి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. తనపై లైంగికదాడి జరిగిందన్న విషయాన్ని ఆ యువతి ఇంట్లో చెప్పగా తల్లిదండ్రులు పట్టించుకోలేదు. దీంతో కార్యకర్తలు ఆమెను తమ వెంట తీసుకెళ్లగా మరునాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా అరారియా కోర్టు సిబ్బంది తెల్ల పేపర్‌పై సంతకం చేయాలని బాధిరాలికి చెప్పగా ఆమె అభ్యంతరం తెలిపింది. తన సహాయకులను రప్పించాలని ఆమె కోరింది. మరోవైపు ఆమెకు అండగా నిలిచిన ఇద్దరు మహిళా కార్యకర్తలు కోర్టు సిబ్బందిని కలిశారు. లైంగిక దాడి బాధితురాలి కేసు స్టేట్‌మెంట్‌లో అవాస్తవాలు పేర్కొన్నట్లు తమకు తెలిసిందని దానిని చూపాలని కోరారు.
అయితే తమ విధులకు ఆటంకం కల్పించారన్న ఆరోపణలతో లైంగిక దాడి బాధితురాలితోపాటు ఇద్దరు మహిళా కార్యకర్తలపై కోర్టు సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 10వ తేదీ ఆ ముగ్గురిపై కేసు నమోదు చేయడంతోపాటు రిమాండ్ విధించారు. అలాగే 240 కిలోమీటర్లు దూరంలో ఉన్న దల్సింగ్‌సరాయ్‌లోని జైలుకు వారిని తరలించారు.
ఈ విషయం తెలిసిన సామాజిక సంఘాలు, న్యాయవాదులు లైంగికదాడి బాధితురాలి పట్ల వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. ఇందిరా జైసింగ్, ప్రశాంత్ భూషణ్, బృందా గ్రోవర్ వంటి ప్రముఖులతోపాటు దేశవ్యాప్తంగా 376 మంది న్యాయవాదులు… పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులకు లేఖ రాశారు. ఇది హేయమైన చర్య అని, లైంగికదాడికి గురైన బాధితురాలి ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నారని అందులో ఆరోపించారు. ఈ ఘటనపై జోక్యం చేసుకోవాలని కోరారు.
ఈ లేఖపై బుధవారం స్పందించిన పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరారియా జిల్లా సెషన్స్ కోర్టు నుంచి వివరాలు కోరారు. న్యాయమూర్తి దినేశ్ కుమార్ సింగ్ దీనిపై విచారణ జరుపుతారని పేర్కొన్నారు. మరోవైపు బాధితురాలి ఫిర్యాదు పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నలుగురి నిందితుల్లో ఒకరిని మాత్రమే అరెస్ట్ చేశారు.