2 కంటైనర్లు.. అందులో రూ.400 కోట్ల డబ్బు.. మొత్తం మాయం!
నాసిక్ ప్రాంతానికి చెందిన సందీప్ దత్త పాటిల్ నుంచి ఘోటి పోలీసులకు ఫిర్యాదు అందింది.
- కర్ణాటకలోని బెళగావి జిల్లాలో కేసు నమోదు
- బోర్లాఘాట్‌లో దోపిడీ.. డబ్బుతో నిందితులు పరారీ
- నాసిక్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఫిర్యాదు
Karnataka: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో అతిపెద్ద దోపిడీ కేసు నమోదైంది. 2 కంటైనర్ల నిండా ఉన్న రూ.400 కోట్ల డబ్బు మాయమైంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం బోర్లాఘాట్‌లో డబ్బు దోపిడీకి గురైంది. ఆ డబ్బు ఎవరిదన్న విషయం తెలియరాలేదు. బెళగావి ఎస్పీ రామరాజన్ తెలిపిన వివరాల ప్రకారం.. నాసిక్ ప్రాంతానికి చెందిన సందీప్ దత్త పాటిల్ నుంచి ఘోటి పోలీసులకు ఫిర్యాదు అందింది.
Also Read: 113 మందికి పద్మశ్రీ అవార్డులు.. తెలుగు వారి లిస్ట్ ఇదే..
విశాల్‌నాయుడు అనే వ్యక్తితో పాటు మరికొందరు తనను కిడ్నాప్ చేశారని సందీప్ దత్త ఫిర్యాదులో పేర్కొన్నాడు. గత ఏడాది అక్టోబరు 16న ఈ ఘటన చోటుచేసుకుందని, విరాట్ గాంధీ అనే వ్యక్తే తనను కిడ్నాప్ చేయించాడని చెప్పాడు.
ఈ దోపిడీపై నాసిక్‌లో కేసు నమోదుకాగా, జనవరి 6న నాసిక్ ఎస్పీ నుంచి బెళగావి పోలీసులకు ఓ లేఖ అందింది. ఆ తర్వాతే డబ్బు దోపిడీ అంశం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక బృందాన్ని నాసిక్‌కు పంపించారు. దర్యాప్తును కొనసాగిస్తున్న మహారాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం తమ పోలీసులకు సరైన వివరాలు ఇవ్వలేదని రామరాజన్ చెప్పారు.
ఆ డబ్బును కంటెయినర్లలో ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? వంటి వివరాలపై కూడా క్లారిటీ లేదు. మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు గోవా సరిహద్దులో దోపిడీ జరగడంతో ఆయా రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా సోదాలు చేయాల్సి ఉంది.
ఆ డబ్బు ముంబై-థానె రియల్ ఎస్టేట్ వ్యాపారి కిశోర్ శెట్టిదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, గోవా బాలాజీ ట్రస్టుదిగానూ ప్రచారం జరుగుతోంది. పలువురిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. విరాట్ గాంధీని అరెస్టు చేశారు. దోపిడీ జరిగిందంటూ వచ్చిన ఫిర్యాదుపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
