బీజేపీలో చేరిన సైనా నెహ్వాల్!

భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలంపిక్ పతక విజేత సైనా నెహ్వాల్ బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో సైనా తన సోదరి చంద్రాన్షూతో కలిసి బుధవారం (జనవరి 29, 2020) మధ్యాహ్నం 12 గంటలకు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వీరిద్దరూ పార్టీ కండువాను కప్పుకున్నారు.
ముఖ్యమైన ప్రముఖులు ఒకరు బీజేపీలో చేరబోతున్నారంటూ బీజేపీ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ముఖ్యమైనవారు ఎవరో కాదు.. సైనా నెహ్వాల్ అని తేలింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సైనా నెహ్వాల్ బీజేపీ పార్టీలో చేరడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సైనా.. 24 అంతర్జాతీయ టైటిల్స్ తో పాటు 11 సూపర్ సిరీస్ టైటిల్స్ గెలుచుకుంది. 2015లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును కూడా సైనా సొంతం చేసుకుంది. తద్వారా ప్రకాశ్ పదుకొనె తర్వాత సైనా నెహ్వాల్ రెండో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా నిలిచింది.
హర్యాణాలో జన్మించిన సైనా.. భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో ఒకరిగా ఎన్నో మెడల్స్ సాధించింది. ఒలంపిక్స్, కామన్ వెల్త్ గేమ్స్ లో కూడా ఎన్నో మెడల్స్ సాధించింది. 2015లో ప్రపంచ నెం.1 ర్యాంకులో నిలిచిన 29ఏళ్ల సైనా తొలి భారతీయ మహిళా షట్లర్‌గా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం సైనా నెహ్వాల్ 9వ ర్యాంకులో కొనసాగుతోంది.
Saina Nehwal’s sister Chandranshu also joined BJP https://t.co/UwmOe8Hify pic.twitter.com/29BDF4G2QW
— ANI (@ANI) January 29, 2020