చీకట్లో చెట్ల నరికివేత : ముంబైలో హై టెన్షన్

ముంబైలోని ఆరే కాలనీలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. ముంబై మెట్రో.. అరే కాలనీలో కార్ల షెడ్డును నిర్మించాలని తీసుకున్న నిర్ణయంతో శుక్రవారం అర్ధరాత్రి దాదాపు 3వేల భారీ వృక్షాలను నరికివేత తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చెట్లను పడగొట్టవద్దంటూ వందలాది మంది పర్యావరణ కార్యకర్తలు అక్కడికి చేరుకుని నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు వారిపై లాఠీ చార్జీ చేసి అదుపులోకి తీసుకున్నారు.
మెట్రో నిర్ణయాన్ని నిరసిస్తూ పర్యావరణ కార్యకర్తలు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు చెట్ల నరికివేత అడ్డుకోవాలంటూ హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం పిటిషన్లను విచారించిన హైకోర్టు వాటిని కొట్టివేసింది. దీంతో శుక్రవారం రాత్రి కొన్ని చెట్లను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పర్యావరణ కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బుల్డోజర్లకు అడ్డుగా నిలబడి శాంతియుతంగా నిరసన చేపట్టారు.
రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టి అదుపులోకి తీసుకున్నారు. మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై నిబంధనల ప్రకారం కోర్టు ఆర్డర్ వెబ్‌సైట్‌లో పెట్టిన 15 రోజుల తర్వాతే చెట్లు నరికివేసే వీలుంటుందని పర్యావరణ కార్యకర్తలు చెబుతున్నారు. కానీ మెట్రో అధికారులు మాత్రం అర్ధరాత్రి అత్యుత్సాహం ప్రదర్శించి చెట్లను నరికివేయడం దారుణమన్నారు. కోర్టు అనుమతితోనే చెట్ల నరికివేత కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
కాగా ఈ ఘటనపై శివసేన చీప్ ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, వర్లీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిత్య ఠాక్రే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మెట్రో 3 పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాల్సింది. కానీ అర్ధరాత్రి ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు. భారీగా పోలీసులను మోహరించి ఇలా చేయాల్సిన అవసరం ఏముంది. ఈ ప్రాజెక్టు ముంబైకి స్వచ్ఛమైన గాలి పీల్చుకునే ప్రయోజనం చేకూరుస్తుంది అనుకున్నాం గానీ, ఇలా చెట్లను నరకుతుంది అనుకోలేదు అని వరుస ట్వీట్లు చేశారు. మరికొందరు నాయకులు కూడా చెట్ల నరికివేతను వ్యతిరేకిస్తూ ట్వీట్లు చేశారు.
#Mumbai This is how poor Adivasi’s are being treated so that politicians can destroy #AareyForest and make their dirty construction money under the guise of a Carshed that can go somewhere else. Please don’t stand for this. ?? #SaveAareyForest pic.twitter.com/mzyiJ2tsTo
— Nayomie PK (@PNayomie) October 4, 2019