NCP: ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం కొత్త పేరు
ఎన్నికల చిహ్నంగా మర్రి చెట్టు, ఉదయించే సూర్యుడు చిత్రాలను ఇవ్వాలని ఎన్సీపీ శరద్ పవార్ వర్గం ప్రతిపాదించింది.

NCP
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం కొత్త పేరు ఇచ్చింది. ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్చంద్ర పవార్’గా ఆయన పార్టీకి పేరు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. శరద్ పవార్ వర్గం మొత్తం మూడు పేర్లను ఎన్నికల సంఘానికి ప్రతిపాదించింది. ఎన్సీపీ శరద్ పవార్, ఎన్సీపీ శరద్చంద్ర పవార్, ఎన్సీపీ శరద్రావు పవార్‌లో ఏదో ఒకటి ఇవ్వాలని కోరింది. అలాగే, ఎన్నికల చిహ్నంగా మర్రి చెట్టు, ఉదయించే సూర్యుడు చిత్రాలను ఇవ్వాలని ఎన్సీపీ శరద్ పవార్ వర్గం ప్రతిపాదించింది.
శరద్ పవార్‌కు నిన్న ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గానికి పార్టీ పేరు, గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిన్న నిర్ణయం తీసుకుంది. పార్టీకి చెందిన మెజార్టీ సభ్యుల మద్దతు తనకే ఉందని అజిత్ పవార్ మొదటి నుంచి చెబుతున్నారు.
కొన్ని నెలల క్రితం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు షాక్ ఇస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో అజిత్ పవార్ చేరారు. ఎన్సీపీ లెజిస్లేటివ్ పార్టీ సర్కారుకి మద్దతు తెలుపుతోందని అజిత్ చెప్పుకొచ్చారు. ఎన్సీపీ గుర్తు మీదే భవిష్యత్తులోనూ పోటీ చేస్తామని అంటున్నారు. చివరకు ఆయన వర్గానికే గడియారం గుర్తు దక్కింది.
కాగా, శరద్ పవార్ సోదరుడి కుమారుడే అజిత్ పవార్. అజిత్ పవార్ తిరుగుబాటు చేసి, తన వర్గం నేతలతో కలిసి మహారాష్ట్రలోని అధికార బీజేపీ-శివసేన షిండే వర్గంతో కలిశారు. అనంతరం అజిత్ పవార్‌ను ప్రభుత్వం డిప్యూటీ సీఎంగా నియమించుకుంది. ఎన్సీపీ ఎమ్మెల్యేలు అత్యధికంగా అజిత్ వైపే ఉండడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ వర్గానికి కొత్త పేరు ఇచ్చింది ఈసీ.