శివసేనకు పెరిగిన ఎమ్మెల్యేల సపోర్ట్: మహా రాజకీయం.. అమిత్ షా రాసిస్తేనే!

  • Published By: vamsi ,Published On : October 27, 2019 / 04:01 AM IST
శివసేనకు పెరిగిన ఎమ్మెల్యేల సపోర్ట్: మహా రాజకీయం.. అమిత్ షా రాసిస్తేనే!

Updated On : October 27, 2019 / 4:01 AM IST

మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారం దక్కించుకోవాలని భావించింది బీజేపీ. అయితే కచ్చితంగా శివసేనతో కలిసి అధికారం పంచుకోవలసిన పరిస్థితి చివరకు ఏర్పడింది. ఈ క్రమంలో మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీలు చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలంటూ శివసేన డిమాండ్ వినిపిస్తుంది.

ఈ క్రమంలో మహారాష్ట్రలో శివసేనకు మద్దతు పెరుగుతుంది. ఎన్నికలకు ముందే బీజేపీ, శివసేన కూటమిగా ఏర్పడినా కూడా ఇప్పుడు ఎన్‍‌సీపీ మద్దతు, కాంగ్రెస్ మద్దతు అవసరమైతే తీసుకుని శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే లేటెస్ట్‌గా ప్రహార్ జనశక్తి పార్టీ ఎమ్మెల్యేలు శివసేనకు మద్దతు తెలిపారు. అచల్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బచ్చు కడు, మెల్‌ఘాట్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రాజ్‌కుమార్ పటేల్ శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను కలిసి శివసేనకు మద్దతు తెలిపారు.

288 అసెంబ్లీ స్థానాలకు గానూ తాజా ఫలితాల్లో బీజేపీ 103 సీట్లలో, శివసేన 56 సీట్లలో విజయం సాధించాయి. సాధించిన సీట్లను బట్టి చూస్తే శివసేన సపోర్ట్ లేనిది బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు.

ఈ క్రమంలో బీజేపీ-శివసేనలు 50:50 ఫార్ములా ప్రకారమే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా రాతపూర్వకంగా హామీ ఇస్తే ప్రభుత్వం ఏర్పాటుకు సహకరిస్తామని శివసేన చెబుతుంది. లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వనంత వరకు బీజేపీ ప్రభుత్వంలో చేరే ప్రసక్తే లేదని శివసేన స్పష్టం చేస్తుంది.