అభయ “హస్తం” కావాలి :ఢిల్లీకి శివసేన…సోనియాతో భేటీ

మహారాష్ట్రలో ఎన్సీపీ-కాంగ్రెస్ లతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన రెడీ అయింది. ఇవాళ(నవంబర్-11,2019)మధ్యాహ్నాం 2గంటలకు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలవనున్నారు శివసేన నాయకులు. ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేయం,తగినంత బలం తమకు లేదని ఆదివారం(నవంబర్-10,2019)బీజేపీ ప్రకటించడంతో రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ ఆహ్వానించిన విషయం తెలిసిందే.
మరోవైపు ఇవాళ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో శివసేన ముఖ్యనాయకుడు సంజయ్ రౌత్ సమావేశమవనున్నట్లు సమాచారం. శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ని ఆయన నివాసానికి వెళ్లి కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఆయనతో చర్చించనున్నారు. ఉద్దవ్ ఠాక్రే సీఎంగా,డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ వ్యక్తి ఉంటారని మహారాష్ట్రలో ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్రలో ఎన్సీపీ-కాంగ్రెస్ లతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సమయంలో ఎన్టీయేలో భాగస్వామిగా ఇప్పటివరకు ఉన్న శివసేన తరపున కేంద్రమంత్రిగా ఉన్న అర్వింద్ సావంత్ సోమవారం(నవంబర్-11,2019)ఉదయం తన పదవికి రాజీనామా చేశారు.
288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరపున 105మంది విజయం సాధించగా, శివసేనకు 56మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు 44మంది,ఎన్సీపీ 54మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ-శివసేన,ఎన్సీపీ-కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే 50:50ఫార్ములాకు బీజేపీ ఒప్పుకోకపోడంతో శివసేన బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అంగీకరించలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.