మహా రాజకీయం : సీఎం సీటు కోసం శివసేన డిమాండ్

మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం ఖాయమైపోయింది. ఇప్పటికే మేజిక్ ఫిగర్ 145 ను బీజేపీ కూటమి దాటింది. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ కూటమి 159 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే ఇప్పుడు బీజేపీ-శివసేన కూటమి మధ్య సీఎం సీటు హాట్ టాపిక్ గా మారింది. సీఎం సీటు కోసం శివసేన పట్టుబడుతోంది.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బీజేపీ చీఫ్ అమిత్ షా మాట్లాడుతూ…మహా సీఎంగా మరోసారి దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపడతారని క్లారిటీ ఇచ్చారు. అటు ప్రధాని మోడీ కూడా ఫడ్నవీస్ నే సీఎం అభ్యర్థిగా ప్రకటించిన సమయంలో శివసేన మంత్రి పదవుల్లో చెరిసగం, ముఖ్యమంత్రి సీటు కోసం పట్టుబట్టడం మహా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.
ఒకవేళ శివసేనకు సీఎం సీటుని బీజేపీ ఇవ్వాలనకుంటే గతంలో కర్ణాటకలో పాలో అయిన విధానాన్ని అనుసరించే అవకాశముంది. గతంలో కర్నాటకలో బీజేపీ-జేడీఎస్ మధ్య ఓ ఒప్పందం కుదిరింది. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చెరి రెండున్నరేళ్లు సీఎం సీటుని షేర్ చేసుకోవాలని భావించారు. మొదటగా జేడీఎస్ కు అవకాశం ఇచ్చారు. అయితే రెండున్నరేళ్ల తర్వాత కుమారస్వామి బీజేపీకి షాక్ ఇచ్చారు. సీఎం సీటు దిగేందుకు నిరాకరించారు. చివరికి బీజేపీకి మద్దతు ఉపసంహిరంచుకుని ప్రభుత్వాన్ని కూల్చేశారు. అయితే ఇప్పుడు మహారాష్ట్రలో ఇలాంటి ఫార్ములాని బీజేపీ పాటిస్తుందా లేక శివసేనకు డిప్యూటీ సీఎం ఆఫర్ చేసి అంతటితో సరిపెడుతుందా అనేది చూడాలి.