చినుకు పడితే, వెన్నులో వణుకే..! ఆ ఒక్క తప్పే చెన్నైని ముంచేస్తోందా?

Chennai Floods (Photo Credit : Google)
Chennai Floods : ఆకాశానికి చిల్లు పడిందా? వరుణుడు పగబట్టాడా? అనే రేంజ్ లో చెన్నైలో వానలు దంచికొడుతున్నాయి. నదుల్లా మారిన వీధులు, చెరువుల్లా కనిపిస్తున్న వాడలు, చుట్టూ నీళ్లు, అందులో కలిసిన కన్నీళ్లు.. మహానగరంలో ఇదీ దుస్థితి. చినుకు పడుతుందంటే వెన్నులో వణుకు పుడుతోంది. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు అందరూ వరద బాధితులే. ఇంతకీ చెన్నై ఇప్పుడెలా ఉంది? జనాల పరిస్థితి ఏంటి?
తుపాను రావడం చెన్నై అతలాకుతలం కావడం.. ఏటా ఇదే జరుగుతోంది. వరదలు అలవాటు అయ్యాయో ఏమో.. వర్షం చిన్నగా స్టార్ట్ అయినా పెద్ద జాగ్రత్తలు తీసుకుంటున్నారు అక్కడి జనాలు. అసలు చెన్నైకి వరద పీడ వదిలేది ఎప్పుడు? ఆ ఒక్క తప్పే చెన్నైని వరదల్లోకి నెట్టేస్తోందా? ఈ పరిస్థితికి చెక్ పెట్టేది ఎలా?
ఎప్పుడు వర్షాలు పడినా చెన్నై నగరం చెరువైపోతోంది. వాతావరణ మార్పులతో ఏటా తుఫాన్ల ప్రభావం పెరుగుతోంది. 1943లో మొదలైన వరదల తాకిడి ఇప్పటివరకు కంటిన్యూ అవుతోంది. చెన్నై వరదలకు ప్రకృతి విపత్తుకంటే మానవ తప్పిదాలే ప్రధాన కారణం. చెన్నైలో మొత్తం 6 అటవీ ప్రాంతాలు ఉన్నాయి. 3 నదులు, 5 తడి నేలలు ఉన్నాయి. అయితే, ఈ ఎకో సిస్టమ్ క్రమంగా దెబ్బతింటూ వచ్చింది. తడి నేలలు, నదుల విస్తీర్ణం తగ్గిపోయింది.
నగరం భౌగోలిక పరిస్థితులు కూడా వరద ముప్పునకు కారణం అవుతున్నాయి. సముద్ర మట్టానికి చాలా ప్రాంతాలకు కేవలం 2 మీటర్ల ఎత్తులోనే ఉన్నాయి. వరదలు రాగానే ఈ ప్రాంతాలన్నీ నీట మునిగిపోతున్నాయి. పైగా చెన్నై చదునైన ప్రాంతం కావడంతో నీళ్లు అంత త్వరగా సిటీ నుంచి బయటకు వెళ్లిపోలేవు. నగర వ్యాప్తంగా 300కి పైగా వరద ముప్పు ప్రాంతాలను గుర్తించారు. ఇప్పటికీ ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా నష్టం వాటిల్లుతోంది.
* వరద నీటిని మళ్లించే కాలువ వ్యవస్థ సరైన విధంగా లేకపోవడం మరో సమస్య
* సిటీలోని ఆక్రమణలు కూడా వరదలకు మరో కారణం
* గ్రామాలు ఆక్రమణకు గురయ్యాయి, వ్యవసాయ భూములు మాయమైపోయాయి
* ఇదే వాతావరణ మార్పులకు దారితీసింది
* 2011 నాటికి చెన్నై కార్పొరేషన్ విస్తీర్ణం నాలుగింతలు పెరిగింది
* ఆ తర్వాత స్పెషల్ ఎకనామిక్ జోన్లు ఏర్పాటయ్యాయి
* ఇష్టారీతిన భూగర్భ జలాలు తోడేశారు
* పరిశ్రమల నుంచి ఘన వ్యర్ధాల కారణంగా కలుషితమైన నీరు
* ఆక్రమణలకు గురైన సహజ నీటి వనరులు
* చెరువులు, కొలనులు మాయమయ్యాయి
* దీంతో వరద నీటిని దారి మళ్లించేందుకు వేరే మార్గమే కనిపించడం లేదు.
* ఇప్పటికిప్పుడు డ్రైనేజ్ నెట్ వర్క్ ని పూర్తి స్థాయిలో రీబిల్డ్ చేస్తే తప్ప వరద ముప్పు నుంచి బయటపడలేము అంటున్న నిపుణులు
Also Read : మహాయుతి వర్సెస్ మహా వికాస్ అఘాడీ.. మహారాష్ట్ర ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలేంటి?