Supreme Court: స్వలింగ వివాహాలకు చట్టబద్ధతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
స్వలింగం వివాహాల ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటీషన్లపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది.

Supreme Court
Queer Couple Marriage Verdict : స్వలింగ వివాహాల చట్టబద్ధతపై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కీలక తీర్పును వెల్లడించింది. ఈ సందర్భంగా పలు విషయాలను ప్రస్తావించింది. ఈ విషయంలో మనం ఎంత దూరం వెళ్లాలి అనే విషయంలో కొంత అంగీకారం, భిన్నాభిప్రాయాలు ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. హోమో సెక్సువాలిటీ కేవలం పట్టణాలు, సమాజంలో ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైనదనే అభిప్రాయాన్ని వీడాలని సీజేఐ చంద్రచూడ్ పేర్కొన్నారు. ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం సుప్రీం ఇచ్చే ఆదేశాలు అధికారాల విభజనకు అడ్డంకికాదని తెలిపారు. ప్రత్యేక వివాహ చట్టం యొక్క పాలనలో మార్పు చేయాలా వద్దా అనేది పార్లమెంటు నిర్ణయిస్తుందని, దీని చట్టపరిధిలోకి కోర్టు వెళ్లాలనుకోవట్లేదని చెప్పారు.
Read Also : Hamas Hostage: హమాస్ మరో వీడియో విడుదల.. తీవ్ర గాయాలతో ఇజ్రాయెల్ మహిళ.. ఏం చెప్పిందంటే?
వివాహ వ్యవస్థకు సంబంధించిన నిర్ణయాలు పార్లమెంట్ మాత్రమే చేయగలదని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రేమ అనేది మానత్వ లక్షణం. జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం జీవితంలో అంతర్భాగమని, ఆర్టికల్ 21 ప్రకారం జీవితానికి, స్వేచ్ఛకు సంబంధించిన హక్కుకు మూలంగా భాగస్వామిని ఎన్నుకునే సామర్థ్యం ఉందని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు. స్వలింగం జంటల హక్కులు, హక్కులను నిర్ణయించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి కేంద్రాన్ని సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ జంటలు రేషన్ కార్డులు, పెన్షన్, గ్రాట్యుటీ నుంచి సంక్రమించే హక్కులు, బీమా సౌకర్యాలు మొదలైనవాటిని కలిగి ఉండే అవకాశాన్ని కమిటీ పరిశీలిస్తుందని సీజేఐ అన్నారు. వివాహేతర జంటలతో పాటు స్వలింగ జంటలు కూడా బిడ్డలను దత్తత తీసుకోవచ్చని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. భిన్న లింగాల జంటలే మంచి తల్లిదండ్రులుగా ఉంటారని చట్టం భావించట్లేదని పేర్కొన్నారు. లైంగిక ధోరణి ఆధారంగా వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని న్యాయస్థానం ఈ సందర్భంగా అభిప్రాయ పడింది.
Read Also : Revanth Reddy: కాంగ్రెస్ ఫస్ట్ లిస్టులో రేవంత్ మనుషులకే ఎక్కువ టికెట్లు దక్కాయా?
స్వలింగం వివాహాల ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటీషన్లపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సంజయ్ కిషన్ కౌల్, ఎస్. రవీంద్ర భట్, హిమ కోహ్లీ, పీఎస్ నరసింహుల ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. 10 రోజులపాటు వాదోపవాదాలను విన్న తరువాత మే 11న తీర్పును సర్వోన్నత న్యాయస్థానం రిజర్వు చేసిన విషయం తెలిసిందే. తీర్పును రిజర్వ్ చేసిన ఐదు నెలల తరువాత సుప్రీంకోర్టు మంగళవారం తీర్పును వెల్లడించింది. అయితే, ఈ విచారణలో భాగంగా మార్చి 13న కేంద్రం తన అఫిడవిట్ దాఖలు చేస్తూ, స్వలింగ వివాహాల చట్టబద్ధతకు ససేమీరా అంది. సహజ ప్రకృతికి విరుద్ధంగా జరిపే లైంగిక చర్యలుగా పేర్కొంది. స్వలింగ వివాహాలు సమాజంలో కొత్త సమస్యను సృష్టిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ వివాహాలకు గుర్తింపు కల్పించక పోవడం వివక్ష కాదని ప్రభుత్వం వాదించింది.