బీజేపీ పై సర్జికల్ స్ట్రైక్స్ : రాహుల్ గాంధీ

ఢిల్లీ: రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వంపై సర్జికల్ స్ట్రైక్స్ చేపడతామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. పేదవారిని ఆదుకోవడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలోనూ, రైతులను ఆదుకోవటంలోనూ బీజీపీ ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆయన విమర్శించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు, ఈవీఎంలలో జరుగుతున్న అవకతవకతలపై చర్చించేందుకు “సేవ్ ది నేషన్,సేవ్ డెమోక్రసీ ” పేరుతో ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో శుక్రవారం బీజేపీయేతర 23 విపక్షాలు సమావేశం అయ్యాయి. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పైనా, లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఈవీఎంల పనితీరు, వాటిపై వస్తున్న ఆరోపణల గురించి చర్చించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ,కాంగ్రెస్నేత గులాంనబీ ఆజాద్, జాతీయ నేతలు శరద్‌పవార్, డీ రాజా, శరద్ యాదవ్, డీఎంకే నాయకురాలు కనిమొళి, ఏకే ఆంటోని, తో సహా పలువురు జాతీయ నాయకులు హాజరయ్యారు.
ఈవీఎంల పనితీరుపై అనుమానాలున్నాయని, సోమవారం ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు రాహుల్ గాంధీ చెప్పారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ హాయాంలో వ్యవస్ధలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆయన విమర్శించారు. ఎన్టీఏ ప్రభుత్వ హాయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, అంబానీ కంపెనీకే కేంద్రం రూ.30 వేల కోట్ల రూపాయలు లబ్ది చేకూరేలా కేంద్ర వ్యవహరించిందని ఆరోపించారు. సమావేశం అనంతరం… రాహుల్, చంద్రబాబు ఒకే వాహనంలో రాహుల్ నివాసానికి వెళ్లారు.