ఈ ఏడాది కూడా 9,10,11వ తరగతి పరీక్షలు రద్దు

ఈ ఏడాది కూడా 9,10,11వ తరగతి పరీక్షలు రద్దు

Updated On : February 25, 2021 / 3:10 PM IST

tamilnadu కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది కూడా 9, 10, 11వ తరగతి పరీక్షలను రద్దుచేసినట్లు సీఎం పళనిస్వామి ప్రకటించారు. ఆ మూడు తరగతుల విద్యార్థుల్ని పరీక్షలు లేకుండానే ఇంటర్నల్ అసెస్ మెంట్ ఆధారంగా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటించారు.

దేశంలో ప్రస్తుతం మహారాష్ట్ర,కేరళ తర్వాత తమిళనాడులోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగే అవకాశముందని, 10,11వ తరగతి పరీక్షలు ఇప్పుడు నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవని వైద్య నిపుణులు చెప్పడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రెండు విధాలుగా ఆ విద్యార్థులకు మార్కులకు వేయనున్నట్లు సమాచారం. 80శాతం మార్కులు.. క్వార్టరీ,హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో విద్యార్థి పర్ఫార్మెన్స్ ఆధారంగా నిర్ణయించబడతాయని..మిగిలిన 20శాతం మార్కులు అటెండెన్స్(హాజరు)ఆధారంగా నిర్ణయింబడనున్నాయి. కాగా, గతేడాది కూడా కరోనా కారణంగా తమిళనాడు ప్రభుత్వం పరీక్షలు లేకుండానే స్కూల్ విద్యార్థుల్ని పాస్ చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పళనిస్వామి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రిటైర్మెంట్ వయసును 59 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి పళని స్వామి అసెంబ్లీలో ప్రకటించారు. సీఎం నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ఉన్న పళని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రైతులకు రుణమాఫీ కూడా ప్రకటించారు.