మోడీ, అమిత్ షా లకు చేరువలో వైసీపీ

పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ తన కార్యాలయాన్ని కోల్పోయింది. గత కొన్ని సంవత్సరాలుగా పార్లమెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లోని 5వ నెంబరు గదిలో కొనసాగుతున్న టీడీపీ ఆఫీస్ ను స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ఖాళీ చేయించారు. ఆ గదిని వైసీపీకి కేటాయించారు. టీడీపీకి మూడో ఫ్లోర్ లోని 118వ నెంబర్ గదిని కేటాయించారు.
పార్లమెంట్ లో వివిధ పార్టీలకు చెందిన బలాబలాలను బట్టి కార్యాలయాలను కేటాయించారు. ఐదుగురు కంటే ఎక్కువ ఎంపీలు ఉంటేనే పార్టీ కార్యాలయాన్ని కేటాయిస్తారు. కాగా బీజేపీకీ గ్రౌండ్ ఫ్లోర్ లో 2,3,4 గదులు కేటాయించగా 5వ నెంబర్ గది వైసీపీకి వచ్చింది. దీంతో మోడీ, అమిత్ షా ల కార్యాలయాలకు చేరువలో వైసీపీ ఆఫీస్ వచ్చినట్టు అయ్యింది.
3 నెలల కిందటే కార్యాలయాల కేటాయింపులు చేస్తూ స్పీకర్ ఉత్తర్వులు ఇచ్చినా టీడీపీ మాత్రం.. పార్టీ ఆఫీస్ ను ఖాళీ చేయలేదు. టీడీపీ వ్యవహారంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పీకర్ కు లేఖ రాశారు. దీంతో లోక్ సభ స్పీకర్… టీడీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. దాన్ని వైసీపీకి ఇచ్చారు. పార్లమెంట్ సిబ్బంది 5వ నెంబర్ గది దగ్గర వైసీపీ నేమ్ బోర్డును ఏర్పాటు చేశారు.