శత్రు దుర్భేద్య భారత్ : త్వరలో తేజస్ మార్క్-2 అందుబాటులోకి

శత్రు దుర్భేద్య భారత్ :  త్వరలో తేజస్ మార్క్-2 అందుబాటులోకి

Updated On : January 31, 2021 / 6:40 PM IST

Tejas Mark II తేజస్​ సిరీస్​లోనే అత్యంత శక్తివంతమైన దేశీయ యుద్ధవిమానం ‘తేజస్​ మార్క్-2’ను వచ్చే ఏడాది ఆగస్టు-సెప్టెంబర్​లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు హిందుస్థాన్​ ఎరోనాటిక్స్​ లిమిటెడ్​ చైర్మన్ అండ్ మేనేజింగ్​ డైరక్టర్​ ఆర్. మాధవన్ తెలిపారు. శక్తివంతమైన ఇంజిన్​, అధిక బరువును మోయగలిగే సామర్థ్యం, ఎలక్ట్రానిక్​ వార్​ఫేర్​ సిస్టమ్​, తదితర అత్యాధునిక ప్రమాణాలతో దీనిని రూపొందిస్తున్నామని తెలిపారు.

ఈ యుద్ధవిమాన హైస్పీడ్​కు సంబంధించిన​ ట్రయల్స్​ను 2023లో నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతమున్న తేజస్ మార్క్​1 కంటే ఈ యుద్ధ విమానం చాలా శ్రేష్ఠమైనదని తెలిపారు. తేజస్ మార్క్​​ 1ఏ యుద్ధ విమానమే.. చైనాకు చెందిన జేఎఫ్​-17 కంటే ఎన్నోరెట్లు శక్తివంతమైనదన్నారు. 2025 నాటికి తేజస్​ మార్క్​-2 విమానాల ప్రొడక్షన్(ఉత్పత్తి) ప్రారంభించనున్నట్లు ఆర్. మాధవన్ తెలిపారు. తేజస్ ప్రాజెక్టుకు మొత్తం రూ. 48వేల కోట్లను కేటాయించామని,..తేజస్ యుద్ధ విమానాలు కచ్చితంగా వాయుసేన రంగాన్ని బలోపేతం చేస్తాయని మాధవన్ తెలిపారు.

మరోవైపు, వాయుసేనకు యుద్ధవిమానాల కొరత తీవ్రంగా ఉన్నందున ఇటీవల కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ తేలికపాటి యుద్ధవిమానం తేజస్​ మార్క్-1A రకానికి చెందిన 83 యుద్ధవిమానాల కొనుగోలుకు ఇటీవల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. వాస్తవానికి వాయుసేన అవసరాలు తీర్చాలంటే ప్రభుత్వ లెక్కల ప్రకారమే 42 స్క్వాడ్రన్‌లు ఉండాలి. కానీ, కాలం చెల్లిన మిగ్‌ల తొలగింపు.. విమాన ప్రమాదాల కారణంగా వీటి సంఖ్య దాదాపు 30కి అటు ఇటుగా చేరింది. 18 విమానాల జట్టును స్క్వాడ్రన్‌గా భావిస్తారు. ఇప్పుడు తాజా మరో 83 తేజస్‌ విమానాలు 2026నాటికి వాయసేనలో చేరనున్నాయి. తొలి విమానం 2022లో చేతికి అందగా.. ఈ మోడల్‌ తొలి స్క్వాడ్రన్‌ 2024లో పూర్తికానుంది.

ఎల్‌సీఏ(తేలికపాటి యుద్ధవిమానం) విభాగంలో తేజస్‌ ప్రపంచంలోనే అత్యుత్తమైందని చెబుతారు. వాస్తవానికి 35ఏళ్లకు పైగా సుదీర్ఘకాలం పాటు సాగిన ప్రాజెక్టు.. ఉత్పత్తి మందకొడిగా ఉంది.. విదేశీ పరికరాల వినియోగం ఎక్కువ.. ఇలా తేజస్‌పై పలు విమర్శలు వచ్చాయి. కానీ, ఈ విమానం సామర్థ్యంపై మాత్రం ఎటువంటి విమర్శలు లేవు.

తేజస్‌తో పోలిస్తే “తేజస్ మార్క్-1A”లో చాలా మార్పులు

తొలితరం తేజస్‌తో పోలిస్తే “తేజస్ మార్క్-1A” రకంలో చాలా మార్పులు చేయనున్నారు. ఇప్పటికే వాయుసేనలో ఉన్న తేజస్‌ ఎంకే1(ఎఫ్‌వోసీ)కి ఇది అడ్వాన్స్ మోడల్‌. దీనిలో క్వాడ్రప్లక్స్‌ డిజిటల్‌ ఫ్లైబైవైర్‌ వ్యవస్థను వినియోగించారు. విమానం బరువు తగ్గించేందుకు తయారీలో ప్రత్యేక మిశ్రమ లోహాలను వినియోగించారు. వీటి వల్ల విమానం ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. ఇది 3,500 కిలోల ఆయుధాలను తీసుకెళ్లగలదు. భూమి 15 కిలోమీటర్ల ఎత్తున ప్రయాణిస్తూ దాడుల్లో పాల్గొనగలదు. గాల్లోనే ఇంధనం నింపుకొనే సామర్థ్యం కూడా దీనికి ఉంది. ఇది సూపర్‌సానిక్‌ వేగంతో ప్రయాణించగలదు.

తేజస్‌ మార్క్-1Aలో దేశీయ పరికరాలు 50శాతం నుంచి 60శాతానికి చేర్చనున్నారు. లార్సన్‌ అండ్‌ టుబ్రో, డైనమాటిక్‌ టెక్నాలజీస్‌, ఆల్ఫాడిజైన్‌ వంటి 70కిపైగా ప్రముఖ సంస్థలు దీనిలో తయారీలో భాగస్వాములు. అంతేకాదు ఉత్పత్తిని వేగవంతం చేయడానికి హెచ్‌ఏఎల్‌.. నాసిక్‌, బెంగళూరు డివిజన్లలో రెండో తయారీ యునిట్లను కూడా సిద్ధం చేసింది. ప్రస్తుతం హాల్‌(HAL)లో ఏడాదికి 8 విమానాలను మాత్రమే తయారు చేస్తున్నారు. దీనిని 16 విమానాల స్థాయికి తీసుకెళ్లనున్నారు. ఇక్కడ అదనపు సౌకర్యాల కోసం ప్రభుత్వం కూడా రూ.1200 కోట్లను మంజూరు చేసింది. దీంతోపాటు వచ్చే సరికొత్త విమానాల కోసం బేసుల్లో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

సగానికి పైగా దేశీయ పరికరాలనే వినియోగంచడంతో ఈ విమానాల నిర్వహణ సులువుగా మారనుంది. గతంలో విదేశాల నుంచి విడిభాగాలను తెచ్చుకోవాలంటే సవాలక్ష నిబంధనలు పాటించాల్సి వచ్చేది. కీలక యుద్ధసమయాల్లో విదేశాలు విడిభాగాలు సరఫరాలను నిలిపేసిన సంఘటనలను వాయుసేన చవిచూసింది. ఇప్పుడు ఈ బాధ కొంత తప్పుతుంది. యుద్ధవిమానాలను పూర్తిస్థాయి ఫీచర్లతో ఏ దేశం మరో దేశానికి విక్రయించదు. కేవలం ఎగుమతుల కోసం తయారు చేసిన మోడల్‌ను మాత్రమే విక్రయిస్తుంది. అంటే వాస్తవిక మోడల్‌ కంటే కొంత సామర్థ్యం తగ్గుతుందన్నమాట. దేశీయ యుద్ధవిమానాలతో ఈ సమస్య తప్పుతుంది.

16లక్ష్యాలు ఒకేసారి..

సరికొత్త తేజస్‌ విమానాల్లో యాక్టివ్‌ ఎలక్ట్రికల్లీ స్కాన్డ్‌ యారే (ఏఈఎస్‌ఏ) రాడార్లను వినియోగించనున్నారు. ఇవి అత్యాధునికమైనవి. శత్రుదేశాల ఎలక్ట్రానిక్‌ జామింగ్‌ వ్యవస్థను సమర్థవంతంగా తట్టుకొని పని చేస్తుంది. దీంతోపాటు శత్రుదేశాల రాడార్ వార్నింగ్‌ రిసీవర్లు వీటిని అడ్డుకోవడం కష్టం. దీంతోపాటు వివిధ మోడల్‌లలో కూడా పనిచేస్తుంది. రియల్‌బీమ్‌ మ్యాపింగ్‌, భూమిపై కదిలే లక్ష్యాలను గుర్తించడం, గగనతలంలో వచ్చే ముప్పులను గుర్తించడం వంటివి చేస్తుంది. ఇది ఏకకాలంలో పలు లక్ష్యాలను గుర్తించగలదు. మొత్తం 16 లక్ష్యాలను గుర్తిస్తుంది.