Telangana Assembly Polls : ఏడుపదుల వయసు దాటినా ఎన్నికల బరిలో నిలిచిన సీనియర్లు.. ఇదీ తెలంగాణ అసెంబ్లీ సిత్రం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఏడుపదుల వయసు దాటిన సీనియర్ రాజకీయ నాయకులు సైతం ఈ సారి ఎన్నికల బరిలో నిలిచారు....

Telangana Assembly Polls : ఏడుపదుల వయసు దాటినా ఎన్నికల బరిలో నిలిచిన సీనియర్లు.. ఇదీ తెలంగాణ అసెంబ్లీ సిత్రం

Seniors leaders cotest

Updated On : November 16, 2023 / 10:31 AM IST

Telangana Assembly Polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఏడుపదుల వయసు దాటిన సీనియర్ రాజకీయ నాయకులు సైతం ఈ సారి ఎన్నికల బరిలో నిలిచారు. ఈ సారి ఎన్నికల్లో తమ వారసులను ఎన్నికల బరిలోకి దించాలని కొందరు సీనియర్ నేతలు భావించినా ఆయా పార్టీల అధిష్ఠాన వర్గాలు వారికే టికెట్టును ఖరారు చేయడంతో వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

సీనియర్ నేతల ఆసక్తికర పోరు

దశాబ్దాలుగా ఎన్నెన్నో ఉన్నత పదవులు నిర్వహించిన సీనియర్ నేతలు ఈ సారి ప్రత్యర్థులతో తలపడుతుండటం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర వైద్యశాఖ మంత్రిగా పనిచేసిన వనమా వెంకటేశ్వరరావు వయసు 79 ఏళ్లు. తన రాజకీయ వారసుడైన వనమా రాఘవ మహిళను వేధించిన కేసులో జైలుకు వెళ్లడంతో ఇబ్బందులు వస్తాయని నాల్గవసారి వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

రాజకీయ కురువృద్ధుడు

ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే ఈ ఐదేళ్లు పూర్తి అయితే ఆయన వయసు 84 ఏళ్లు కానుంది. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వనమా ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. మరో వైపు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పోటీలో నిలిచారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం పాటు పనిచేసిన తుమ్మల రాష్ట్రమంత్రి పువ్వాడ అజయ్ తో తలపడుతున్నారు.

వారసుడిని ఎన్నికల్లో దించాలని యోచించినా…అంగీకరించని కేసీఆర్

మంత్రిగా, స్పీకరుగా పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డి వయసు 74 ఏళ్లు. కురువృద్ధుడైన పోచారం తన వారసుడైన కుమారుడిని బరిలోకి దించాలని భావించారు. కాని అధినేత కేసీఆర్ అంగీకరించక పోవడంతో మరోసారి బాన్స్ వాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఆదిలాబాద్ జిల్లాపరిషత్ ఛైర్మన్ గా, ఎంపీగా, ఎమ్మెల్యేగా సుధీర్ఘకాలం పనిచేసిన అల్లోల ఇంధ్రకరణ్ రెడ్డి వయసు 74 ఏళ్లు. తన కంటే తక్కువ వయసున్న ప్రత్యర్థులతో అల్లోల ఎన్నికల బరిలో నిలిచారు.

నాలుగుసార్లు విజయం సాధించి…

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, జాతీయ విపత్తుల సంస్థ సభ్యుడిగా సేవలందించిన మర్రి శశిధర్ రెడ్డి వయసు 74 ఏళ్లు. సీఎంగా పనిచేసిన తన తండ్రి మర్రి చెన్నారెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన శశిధర్ రెడ్డి ఈసారి బీజేపీ అభ్యర్థిగా సనత్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అయిదు సార్లు విజయం సాధించిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి వయసు 71 ఏళ్లు. ఈయన మరోసారి సూర్యాపేట నియోజకవర్గ బరిలోకి దిగారు.

ఎన్నికల్లో పోటీకి దూరమైన సీనియర్లు

కాని సీనియర్ నేతలైన కుందూరి జానారెడ్డి, గీతారెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, పట్నం మహేందర్ రెడ్డి, చిన్నారెడ్డి, డీకే అరుణ, మల్లు రవి తదితరులు ఎన్నికల సంగ్రామానికి దూరంగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీకి వయసు ఆటంకం కాదని నిరూపిస్తూ పలువురు సీనియర్ నేతలు ఎన్నికల బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కురువృద్ధుల పోరులో విజయం సాధిస్తారా లేదా అనేది ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.