మాజీ సీఎం కరుణానిథికి గుడి : తంబీల ప్రేమ అలాగే ఉంటుంది

అంతులేని అభిమానం..ప్రేమ. రాజకీయ నేతలైనా..సినిమా నటులైనా తమిళ ప్రజలు ఒక్కసారి ఆరాధించటం ప్రారంభించారంటే ఎన్నటికీ మరచిపోరు.గుండెల్లో గుడి కట్టి భగవంతుడిగా భావిస్తారు. ఆరాధిస్తారు. తమిళనాడు ప్రజలు నేతలపైనా..నటులపైనా వ్యక్త పరిచే ప్రేమాభిమానాలు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రేమాభిమానాలకు పరాకాష్టలా ఉంటారు తమిళ ప్రజలు. అవసరమైతే తమ ప్రాణాన్ని ఇచ్చేంతగా అభిమానిస్తారు. అలా ప్రజల మనస్సుల్ని గెలుసుకున్న నేత దివంగత సీఎం కరుణానిథి.
ప్రజల మనస్సులకు అంతగా దగ్గరయ్యారాయన. ఆయన మరణం పార్టీ ప్రజల్నే కాదు..రాష్ట్ర ప్రజలందరనీ శోక సముద్రంలో ముంచేసింది. ప్రజలైతే..తమ ఇంటి సభ్యులే చనిపోయినంతగా విలపించారు. ఈనాటికీ కూడా కరుణానిధి అంటే ప్రజలకు భగవంతుడే. అందుకే తమ ప్రియతమ నేత కరుణానిధికి గుడి కట్టేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని నమక్కల్ జిల్లాలోని కుచికాడు గ్రామంలో గుడి కడుతున్నారు.
కరుణానిధి తమ కులానికి ప్రత్యేక రిజర్వేషన్‌ను కల్పించినందుకు గౌరవ సూచకంగా నమక్కల్ జిల్లాలోని కుచికాడు గ్రామంలో గుడి కట్టాలని నిర్ణయించుకున్నారు. గుడి కట్టేందుకు భూమి పూజ కూడా చేశారు. 2009 లో డీఎంకే ప్రభుత్వం తమిళనాడు అరుంతతియార్లకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాకుండా..ప్రైవేట్ విద్యాసంస్థలల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించింది. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ పరిధిలో రాష్ట్రంలోని సేవలలో నియామకాలు లేదా పోస్టుల్ని కల్పించేవిధంగా చట్టాన్ని అమలులోకి తెచ్చింది. షెడ్యూల్డ్ వర్గం వారికి కేటాయించి 18 శాతం రిజర్వేషన్లలో అంతియార్స్ (ఎస్సీ వర్గం)వర్గం వారికి మూడు శాతం రిజర్వేషన్ కల్పించింది.
కరుణానిథి తమకు ఇచ్చిన రిజర్వేషన్లను పురస్కరించుకుని కురుణానిథి గౌరవార్థం అంతియార్స్ (ఎస్సీ వర్గం)వర్గం కరుణానిథికి గుడి కడుతున్నారు. రూ. 30 లక్షలతో నిర్మించనున్న ఈ గుడి నిర్మాణానికి ఆదివారం (ఆగస్టు 25)న భూమి పూజ చేశారు. కరుణానిధి అంటే తమకు దైవంతో సమానమని తమకు ఇంత మేలు చేసిన ఆయన్ని దేవుడిగా భావిస్తున్నామనీ అందుకే ఆయనకు గుడి కడుతున్నామనీ అంతియార్ వర్గ పెద్దలు తెలిపారు.