కేబినెట్‌లో విషాదం, కరోనాతో మహిళా మంత్రి మృతి, సంతాపం తెలిపిన సీఎం

కరోనా మహమ్మారి సామాన్యులనే కాదు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులనూ కాటేస్తోంది. తాజాగా రాష్ట్ర కేబినెట్ మంత్రి కరోనాకు బలయ్యారు. ఉత్తర ప్రదేశ్ మంత్రివర్గంలో విషాదం నెలకొంది. యోగి కేబినెట్ లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పని చేస్తున్న కమల్ రాణి వరుణ్(Kamal Rani Varun) కరోనాతో కన్నుమూశారు. ఆమె వయస్సు 62 సంవత్సరాలు. లక్నోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం(ఆగస్టు 2,2020) ఉదయం 9.30కి ఆమె ప్రాణాలు విడిచినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. కొన్ని రోజులుగా మంత్రి కమలా రాణి వెంటిలేటర్ పై ఉన్నారు. ఆమె ఇతర అనారోగ్య సమస్యలతోనూ బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.
జూలై 18 నుంచి ఆసుపత్రిలోనే:
కరోనా పాజిటివ్ అని తేలడంతో జూలై 18న లక్నోలోని సంజయ్‌గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్ లో ఆమెని చేర్పించారు. అక్కడ అత్యవసర చికిత్సను అందించారు. అయినప్పటికీ.. ఆమె ఆరోగ్య పరిస్థితులు మెరుగు పడలేదు. రెండు రోజుల కిందట ఆరోగ్యం మరింత విషమించింది. ఫలితంగా కమల్ రాణిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయినా లాభం లేకపోయింది.