ఉత్తరాఖండ్ సీఎం రావత్ రాజీనామా

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సొంతపార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో సీఎం త్రివేంద్రసింగ్ రావత్ రాజీనామా చేశారు. కొద్ది సేపటి క్రితం గవర్నర్ బేబి మౌర్యని కలిసి ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. అయితే,ఢిల్లీ వెళ్లి బీజేపీ అధిష్ఠానాన్ని కలిసిన మరుసటి రోజే రావత్ రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన రావత్..నాలుగేళ్లు ఉత్తరాఖండ్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు బీజేపీకి ధన్యవాదాలు చెప్పారు. అయితే,రాజీనామా వెనుక ఉన్న కారణం గురించి విలేఖరులు అడిగిన ప్రశ్నకు..ఇది పార్టీ నిర్ణయం అని రావత్ సమాధానమిచ్చారు. కొత్త సీఎంను ఎన్నుకునేందుకు బుధవారం ఉదయం 10గంటలకు పార్టీ ఆఫీసులో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుందని తెలిపారు. త్రివేంద్రసింగ్ రావత్ స్థానంలో సీఎం బాధ్యతలను ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధన్ సింగ్ రావత్ చేపట్టనున్నట్లు సమాచారం. ఉదయ్ సింగ్ నగర్ జిల్లాలోని కతిమా అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పుష్కర్ సింగ్ ధమి డిప్యూటీ సీఎం అవబోతున్నట్లు సమాచారం.
రావత్ నాయకత్వంపై రాష్ట్ర బీజేపీ నేతల్లో కొంతకాలంగా అసంతృప్తి నెలకొన్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రావత్ వ్యవహార శైలి, కేబినెట్ కూర్పులో జాప్యం పట్ల 20మంది వరకు ఎమ్మెల్యేలు,పలువురు మంత్రులు అసంతృప్తిగా ఉండటం ఈ మొత్తం వ్యవహారానికి కారణమని తెలుస్తోంది. అంతేకాకుండా సీఎంపై పార్టీ హైకమాండ్ కు కూడా వీరు ఫిర్యాదు చేశారు. పార్టీలో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు నియామకమైన ఆ పార్టీ జనరల్ సెక్రటరీ దుష్యంత్ కుమార్ గౌతమ్,ఉత్తరాఖండ్ ఇన్ చార్జ్ గా ఉన్న ఛత్తీస్ ఘడ్ మాజీ సీఎం రమణ్ సింగ్ నేతృత్వంలో శనివారం డెహ్రాడూన్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. కోర్ కమిటీ సమావేశం తర్వాత దుష్యంత్ గౌతమ్,రమణ్ సింగ్ లు బీజేపీ అధిష్ఠానానికి నివేదికను అందజేశారు. నివేదిక సమర్పించిన నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం నుంచి సీఎం త్రివేంద్రసింగ్ రావత్ కి ఢిల్లీకి రావాల్సిందిగా సోమవారం పిలుపు వచ్చింది. దీంతో సోమవారం సీఎం రావత్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ నుంచి తిరిగి ఇవాళ డెహ్రాడూన్ చేరుకున్న రావత్ సీఎం పదవికి రాజీనామా చేశారు.