Vande Bharat : నిండు గ్లాసులో నీరు తొనకకుండా.. 180 kmph వేగంతో దూసుకెళ్లిన వందేభారత్ స్లీపర్.. వీడియోలు వైరల్
రైల్వే ప్రయాణీకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రైలు వేగాన్ని క్రమక్రమంగా పెంచుతూ ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు.

Vande Bharat sleeper
Vande Bharat Sleeper Testing Video: రైల్వే ప్రయాణీకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రైలు వేగాన్ని క్రమక్రమంగా పెంచుతూ ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాజస్థాన్ లోని కోటా నుంచి లబాన్ స్టేషన్ల మధ్య గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వందేభారత్ రైలు ట్రయల్ రన్ నిర్వహించారు. 180కిలోమీటర్ల అతివేగంలోనూ రైల్లో సీటు వద్ద ఉన్న ట్రేపై పెట్టిన గ్లాసులో నిండుగా ఉన్న నీరు తొనకకుండా రైలు ప్రయాణం సాఫీగా సాగింది. ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
వందేభారత్ స్లీపర్ రైలుకు సంబంధించి ట్రయల్ రన్స్ లో వేగంతోపాటు స్థిరత్వం, సాంకేతిక వ్యవస్థలను రైల్వే ఇంజనీర్లు పరీక్షించారు. జనవరి 1వ తేదీన రైలును గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిపారు. ఆ తరువాత వేగాన్ని 140, 150, 160 కిలోమీటర్లకు పెంచారు. గురువారం సాయంత్రం రైలు వేగాన్ని గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రస్తుతానికి ట్రయల్ రన్స్ విజయవంతం అయ్యాయి. వచ్చే నెలలోనూ ఈ ట్రయల్స్ కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.
Vande Bharat (Sleeper) testing at 180 kmph pic.twitter.com/ruVaR3NNOt
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 2, 2025
ట్రయల్ రన్ పూర్తయిన తరువాత వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో న్యూఢిల్లీ – పూణే, న్యూఢిల్లీ – శ్రీనగర్ సహా పలు మార్గాల్లో వందేభారత్ స్లీపర్ రైలును నడపనున్నారు. ఇదిలాఉంటే.. వందేభారత్ స్లీపర్ రైళ్ల గురించి కేంద్రం 2023-24 బడ్జెట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ స్లీపర్ రైలులో మొత్తం 16 బోగీలు ఉంటాయి. అందులో 10థర్డ్ ఏసీకి, నాలుగు సెకండ్ ఏసీకి, ఒక బోగీ ఫస్ట్ ఏసీకి కేటాయించడం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు వందే భారత్ స్లీపర్ రైలులో సీటింగ్ తో పాటు లగేజీ కోసం రెండు బోగీలు అందుబాటులో ఉండనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Vande Bharat Sleeper clocking a speed of 180kmph+ disappearing in just 8 seconds 🔥 pic.twitter.com/3mEqgHIRyP
— Trains of India (@trainwalebhaiya) January 1, 2025
వందేభారత్ స్లీపర్ వెర్షన్ లో దాదాపు విమానం తరహా సదుపాయాలు అందుబాటులో ఉండనున్నాయి. అన్ని కోచ్ లలో సీసీ టీవీ నిఘా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఫ్యాసింజర్, రైలు మేనేజర్ లేదా లోకో పైలట్ మధ్య కమ్యూనికేషన్ కోసం ఎమర్జెన్సీ టాక్ -బ్యాక్ యూనిట్ సదుపాయం ఉంది. ఇటీవల రాజ్యసభలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైలులో సౌకర్యాల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం సుదూర ప్రాంతాల్లో ప్రయాణాలకు వందే భారత్ స్లీపర్ రైళ్లు నడిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ రైళ్లలో ఆధునిక ఫీచర్లు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉంచడం జరిగిందని చెప్పారు.
🚨 India’s fastest train, 1st prototype of Vande Bharat Sleeper is now undergoing high-speed trial runs at Kota, Rajasthan. pic.twitter.com/o4QoBGXdgG
— Indian Tech & Infra (@IndianTechGuide) January 2, 2025