కరోనాతో కన్యాకుమారి ఎంపీ కన్నుమూత

  • Published By: venkaiahnaidu ,Published On : August 28, 2020 / 09:43 PM IST
కరోనాతో కన్యాకుమారి ఎంపీ కన్నుమూత

Updated On : August 29, 2020 / 6:24 AM IST

తమిళనాడులోని కన్యాకుమారి ఎంపీ హెచ్. వసంతకుమార్(70) కన్నుమూశారు. ఆయనకు కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వసంత్‌కుమార్… కరోనాతో ఆగస్ట్ 10న చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయన్ను కాపాడేందుకు డాక్టర్లు చేసిన యత్నాలు ఫలించలేదు.

మూడు వారాలుగా కరోనాతో పోరాడుతూ ఇవాళ రాత్రి 7.07 గంటలకు కన్నుమూసినట్టు చెన్నైలోని అపోలో ఆస్పత్రి ప్రకటించింది. వసంత్‌కుమార్‌ మృతి పట్ల కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. వసంతకుమార్ మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కాగా, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కుమారి అనంతన్‌కు.. వసంతకుమార్ సోదరుడు. ప్రస్తుత తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్ రాజన్‌కు బాబాయి అవుతారు.

వసంత్ కుమార్ ప్రస్తుతం తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. తమిళనాడు కాంగ్రెస్‌లోని ముఖ్యనేతల్లో ఒకరైన వసంతకుమార్‌… రెండుసార్లు ఎమ్మెల్యేగా తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2006 సంవత్సరంలో నంగునేరి అసెంబ్లీ నియోజవకర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2016లో మరోసారి విజయం సాధించారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో కన్యాకుమారి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కన్యాకుమారిలో పోటీ చేసిన ఆయన.. అప్పటి కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్‌ మీద భారీ మెజారిటీతో గెలుపొందారు.

వసంతకుమార్ చాలా కిందిస్థాయి నుంచి ఉన్నత స్థానాలకు ఎదిగారు. 1970ల్లో ఆయన సేల్స్‌మెన్‌గా పనిచేసేవారు. 1978లో   వసంత్ అండ్ కో కంపెనీని స్థాపించి గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ డీలర్‌గా మారారు. ఆ తర్వాత ప్రతి ఇంట్లోనూ ఆ కంపెనీ పేరు పరిచయం అయ్యేంతగా మారిపోయింది. కేరళ,కర్ణాటక,తమిళనాడులో కలిపి వసంత్ అండ్ కో సంస్థకు 90 షోరూమ్‌లు ఉన్నాయి. ఆయన వసంత్ టీవీ పేరుతో టీవీ చానల్ కూడా నడుపుతున్నారు.