హమ్మయ్య : వసుంధర రాజే, దుష్యంత్ లకు కరోనా లేదు

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ లకు కరోనా వైరస్ సోకలేదని వైద్యులు చెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వారికి నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ రిపోర్టు వచ్చింది. వీరితో పాటు ఉత్తర్ ప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి జై ప్రతాప్ సింగ్ లో వైరస్ లక్షణాలు కనిపించలేదని వైద్యులు వెల్లడించారు. కింగ్ జార్జీ వైద్య విశ్వవిద్యాలయంలో ఆయనకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతేగాకుండా..ఈయనతో సమావేశమైన..28 మందికి కూడా ఎలాంటి వైరస్ సోకలేదని తెలిపారు.
లఖ్ నవూలో ఓ కార్యక్రమంలో సింగర్ కనికా కపూర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ నెల 9న బ్రిటన్ నుంచి ముంబయి చేరుకున్న కనికాకు.. అక్కడ పరీక్షల్లో కరోనా లక్షణాలేవీ కనిపించలేదు. లఖ్‌నవూలో ఉండగా ఫ్లూ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకుంటే కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెతో సన్నిహితంగా మెలిగిన వారు.. ఆమె కార్యక్రమాలకు వెళ్లిన వారు ఆందోళనకు గురవుతున్నారు. ముందు జాగ్రత్తగా వారంతా సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.
ఇటీవల లఖ్‌నవూ, కాన్పుర్‌లో జరిగిన కొన్ని కుటుంబ వేడుకలు, విందు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లఖ్‌నవూలో కనిక హాజరయిన విందుకు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె, ఆమె కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ వెళ్లారు. ఇప్పుడు కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో వసుంధర రాజే, దుష్యంత్ సింగ్ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. తాజాగా వీరికి ఎలాంటి వైరస్ సోకలేదని వైద్యులు వెల్లడించారు.
మరోవైపు… సింగర్ కనికా కపూర్‌కు మరో షాక్ తగిలింది. ఆమెపై పోలీస్ కేసు నమోదయ్యింది. కరోనాపై ప్రభుత్వం జారీచేసిన నిబంధనలు పాటించనందుకు, కరోనా సోకినా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆమెపై యూపీ పోలీసులు కేసు పెట్టారు. లక్నో చీఫ్ మెడికల్ ఫిర్యాదుతో ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.