NIAకు లేఖ : ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో మోడీ,షా,కోహ్లీ

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోడీ,కేంద్రహోంమంత్రి అమిత్ షా,టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా పలువురు ప్రముఖులను హతమార్చేందుకు ఓ ఉగ్రసంస్థ కుట్ర పన్నినట్లు సమాచారం. ఈ మేరకు ఉగ్రవాద సంస్థ నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)కు ఓ బెదిరింపు లేఖ అందింది. హిట్ లిస్టులో బీజేపీ వృద్ధ నేత ఎల్‌కే ఆడ్వాణీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్,రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్,గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్,ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్,బీజేపీ నేషనల్ సెక్రటరీ రామ్ మాథవ్,పలువురు ప్రముఖులు పేర్లు కూడా ఉన్నాయని తెలిసింది.
ఆలిండియా లష్కరే తయబా హైపవర్ కమిటీ(కోజికోడ్) నుంచి లేఖ వచ్చినట్లు తెలుస్తోంది. బెదిరింపు లేఖతో ప్రముఖులకు భద్రతను పటిష్ఠం చేశారు. ఈ లేఖ ఒక బూటకమని అయి ఉంవచ్చని భావించినప్పటికీ, ముప్పు ఎక్కువగా ఉన్నందున ఎటువంటి అవకాశం తీసుకోకూడదని అధికారులు భావించారు. టీమిండియా నవంబర్-3న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ జట్టుతో తలపడనుంది. ఈ సమయంలో ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉన్న కోహ్లీకి కూడా ఢిల్లీ పోలీసులు భద్రతను పెంచాలని ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అక్టోబర్-31,2019నుంచి జమ్మూకశ్మీర్ పునర్ విభజన చట్టాన్ని అమలు చేస్తున్న సమయంలో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో కేంద్రం ఢిల్లీ పోలీసులను అలర్ట్ చేసింది. ఢిల్లీలో రాగల 48 గంటలపాటు హైఅలర్ట్ ప్రకటించింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ఢిల్లీలోని ముఖ్యమైన ప్రాంతాలు, భవనాల దగ్గర సాయుధ పోలీసులను మోహరించారు. అనుమానిత ప్రాంతాల్లో, వ్యక్తులను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.