ముగిసిన బిహార్ అసెంబ్లీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్.. ఫుల్ డీటెయిల్స్..
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.
Bihar elections 2025
Jubilee Hills Bypoll 2025: బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఫలితాలు నవంబరు 14న వెలువడుతాయి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుష ఓటర్లు 2,08,561, మహిళా ఓటర్లు 1,92,779, ఇతరులు 25 మంది ఉన్నారు. పోలింగ్ బూత్‌లు 407, పోలింగ్ కేంద్రాలు 139 ఏర్పాటు చేసి పోలింగ్ నిర్వహించారు. (Jubilee Hills Bypoll 2025)
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఈ ఏడాది జూన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించడంతో ఈ ఉపఎన్నిక నిర్వహించారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గోపీనాథ్ భార్య సునీత, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు.
బిహార్ ఎన్నికలు- 2025 జరిగిన తీరు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్ ముగిసింది. నేషనల్ డెమొక్రటిక్ అలియన్స్ (ఎన్‌డీఏ) అధికారాన్ని కొనసాగిస్తుందా? లేక తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ అధికారంలోకి వస్తుందా? అన్నది నవంబర్ 14న తేలనుంది. కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. పోలింగ్ ముగిసిన అనంతరం సాయంత్రం 6.30 గంటల నుంచి సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల చేయడం ప్రారంభిస్తాయి.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరిగాయి. మొదటి దశ పోలింగ్ నవంబర్ 6న 65.08 శాతం ఓటింగ్‌తో ముగిసింది. రెండో దశ పోలింగ్ నేడు ముగిసింది. 243 స్థానాల బిహార్ అసెంబ్లీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 122 స్థానాల మెజార్టీ అవసరం.
మొత్తం 243 స్థానాలకు పోటీ జరిగింది. ఎన్‌డీఏ కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా జనతా దళ్ (యునైటెడ్), భారతీయ జనతా పార్టీ 101 స్థానాల చొప్పున పోటీ చేయగా, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 29 స్థానాల్లో, హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్), రాష్ట్రీయ లోక్ మోర్చా తలా 6 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
మహాఘట్‌బంధన్‌లో రాష్ట్రీయ జనతా దళ్ 143 స్థానాల్లో, కాంగ్రెస్ 61 స్థానాల్లో, సీపీఐ 9, సీపీఎం 4, సీపీఐ(ఎం-ఎల్)ఎల్ 20, వికాస్‌శీల ఇన్సాన్ పార్టీ 15 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి.
