దళితులు అంటే అంటరానివారా? : సీబీఎస్‌ఈ పరిక్షల్లో అడిగే ప్రశ్న ఇదేనా?

  • Published By: vamsi ,Published On : September 7, 2019 / 04:01 PM IST
దళితులు అంటే అంటరానివారా? : సీబీఎస్‌ఈ పరిక్షల్లో అడిగే ప్రశ్న ఇదేనా?

Updated On : September 7, 2019 / 4:01 PM IST

పరిక్షల్లో ప్రశ్నలు అంటే ఎలా ఉండాలి? ఆలోచింపజేసేవిగా ఉండాలి. విద్యార్ధుల జీవితాలను సరైన మార్గంలో పెట్టవిగా ఉండాలి. ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడాలి. కాస్త జ్ఞానం తెచ్చేవిగా ఉండాలి. కానీ లేటెస్ట్ గా తమిళనాడులోని ఓ కేంద్రీయ విద్యాలయ నిర్వహించిన పరీక్షలో మాత్రం దారుణమైన ప్రశ్నలను అడిగారు. ఎంత దారుణం అంటే అవి దళితులు, ముస్లింల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయి. ఆరవ తరగతి పిల్లల మనస్సులో దళితులు అంటే అంటరాని వాళ్లు అనే భావాన్ని కల్పించేలా ప్రశ్నలు ఉన్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. దళితులంటే ఎవరు..? అనే ప్రశ్నకు.. ఎ)విదేశీయులు, బి)అంటరానివారు, సి)మధ్య తరగతివారు, డి)ఎగువ తరగతివారు అనే ఆప్షన్లు ఇచ్చారు. ఇక మరో ప్రశ్న ఏంటంటే? ముస్లింలకు సంబంధించిన ఈ క్రింది సాధారణాంశమేది..? అనే ప్రశ్నకు ఎ)ముస్లింలు బాలికలను పాఠశాలకు పంపరు. బి)వారు ప్యూర్‌ వెజిటేరియన్‌, సి)వారు రోఝా సమయంలో నిద్రపోరు, డి)పైవన్నీ.. అని ఆప్షన్లు ఇచ్చారు. అంతేకాదు దళితులు అంటే అంటరానివారు అన్నట్లుగా టిక్ పెట్టి ఉంది.

ఈ ప్రశ్నాపత్రాన్ని తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌ ట్విట్టర్ లో పెట్టారు. సీబీఎస్‌ఈ ఆధ్యర్యంలో నడిచే కేంద్రీయ విద్యాలయ పరిక్షల్లో ఆరో తరగతి ప్రశ్నాపత్రంలో ఈ ప్రశ్న అడిగినట్లు ఎంకే స్టాలిన్‌ ఆరోపించారు. స్టాలిన్‌ ట్వీట్‌ ప్రకారం.. ఆరో తరగతి సాంఘీకశాస్త్రంలోని పాఠ్యాంశం ఆధారంగా ఈ ప్రశ్నలు రూపొందించినట్టు చెప్పారు.

అయితే, ఇది అధికారిక ప్రశ్నాపత్రమేనా అనేదానిపై సందేహాలు ఉన్నాయి. ఇక చెన్నైలోని కేంద్రీయ విద్యాలయ సిబ్బంది ఈ ఆరోపణల్ని ఖండించింది. అయితే ఈ వ్యవహారంపై ఏఎంఎంకే చీఫ్‌ టీటీవీ దినకరణ్‌, రాజ్యసభ ఎంపీ వైకో కూడా విమర్శలు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చిన్నారుల మెదళ్లలో విషాన్ని నింపుతారా అంటూ మండిపడ్డారు.