మోదీ 3.0 ఎలా ఉండబోతోంది..? మిత్రపక్షాల నుంచి ఎదురయ్యే సవాళ్లు ఏంటి? దూకుడు తగ్గించాల్సిందేనా?

తిరగులేని మెజార్టీ ఉన్నప్పుడే వ్యవసాయ చట్టాల అమలులో బీజేపీ వెనక్కి తగ్గాల్సి వచ్చిందని, ఇక మిత్రపక్షాలపై ఆధారపడే స్థితిలో ఎలాంటి వివాదాస్పద చట్టాల జోలికీ ప్రధాని మోదీ వెళ్లరని భావిస్తున్నారు.

మోదీ 3.0 ఎలా ఉండబోతోంది..? మిత్రపక్షాల నుంచి ఎదురయ్యే సవాళ్లు ఏంటి? దూకుడు తగ్గించాల్సిందేనా?

Modi Third Term : 2014-2019 మధ్య కేంద్రంలో బీజేపీది తిరుగులేని అధికారం. ఎవ్వరి మద్దతూ అవసరం లేదు. ఏ పార్టీ నిర్ణయంపై ఆధారపడి అభిప్రాయాలను మార్చుకోవాల్సిన పనిలేదు. అనుకున్నది అనుకున్నట్టుగా చేసేయగల బలం ఉంది. అందుకే పదేళ్లు ప్రధాని మోదీ తిరుగులేని అధికారం చెలాయించారు. బీజేపీ సుదీర్ఘ లక్ష్యాలను సాధించుకున్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో పాటు డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదాన్ని దేశమంతా వినిపించారు. కానీ 2024 ఎన్నికల తర్వాత పరిస్థితి మారిపోయింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండాలని కోరుకున్న బీజేపీకి.. ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి మోదీ 3.0 ఎలా ఉండబోతోంది..? బీజేపీ ప్రధానంగా చెప్పుకునే అంశాల్లో పార్టీ వైఖరి మారుతుందా… పాత విధానమే కొనసాగుతుందా… దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ తర్వాత దేశంలో వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టబోతున్న తొలి నేతగా మోదీ చరిత్ర సృష్టించబోతున్నారు. అయితే దేశస్వాతంత్ర్యోద్యమపోరాట ఘనత, బలంగా లేని ప్రతిపక్షం వంటి అంశాలు….కాంగ్రెస్‌కు దేశవ్యాప్తంగా పూర్తి అనుకూల రాజకీయ పరిస్థితులు నెహ్రూ వరుసగా ప్రధాని పదవి చేపట్టడానికి సహాయపడ్డాయి. కానీ ప్రధాని మోదీ విషయంలో ఆ పరిస్థితి లేదు. 1996 నుంచి దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. 2014, 2019లో బీజేపీకి సొంతంగా మెజార్టీ ఉన్నప్పటికీ…NDA కూటమి పేరుతోనే ప్రభుత్వాన్ని నడిపించారు ప్రధాని. ఈ సంకీర్ణ యుగంలో మూడోసారి ప్రధాని పదవి చేపట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే మోదీ చరిష్మాతోనే ఇది సాధ్యమవుతుందన్నది కాదనలేని సత్యం.

అయితే ప్రధాని పదవిని మూడోసారి మోదీ చేపట్టడానికి అంతా సిద్ధమైనప్పటికీ…గత రెండుసార్లలా ఈ పదవి ఈసారి ప్రధానికి నల్లేరు మీద నడక కాదని భావించాలి. 2019లో సొంతంగా 303 సీట్లు సాధించిన బీజేపీ…చిరకాల లక్ష్యాలను పూర్తిచేసింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 ఎత్తివేత, CAA అమలు వంటివి ఆచరణాత్మకం చేసింది. తిరుగులేని మెజార్టీ ఉండడం వల్లే అసాధ్యమనుకున్నవాటన్నింటినీ బీజేపీ సుసాధ్యం చేసుకుంది. కానీ ఈసారి అలాంటి పరిస్థితులు ఉండబోవన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. మిత్రపక్షాలు చెప్పినట్టుగా నడచుకోవాల్సిన పరిస్థితుల్లోకి ప్రధాని అనివార్యంగా వెళ్లిపోయారు. మూడో విడతపాలనా కాలంలో కామన్ సివిల్ కోడ్, CAA, ప్రైవేటీకరణ వంటి అంశాల్లో ప్రధాని, బీజేపీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ తర్వాతి ఎక్కువ స్థానాలతో టీడీపీ కీలకంగా మారింది. టీడీపీ మద్దతు పొందాలంటే…. చంద్రబాబు చేసే డిమాండ్లు నెరవేర్చక తప్పని పరిస్థితి బీజేపీది. ఏక్‌నాథ్ షిండే, నితీశ్‌కుమార్ వంటి వారూ తమకు అనుకూల నిర్ణయాల కోసం ప్రధానిపై ఒత్తిడి తెచ్చే అవకాశముంది. ప్రయివేటీకరణ, పెట్టుబడులు ఉపసంహరణ వంటి విషయాల్లో గతంలోలా మోదీ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేరన్న భావన నెలకొంది. తిరగులేని మెజార్టీ ఉన్నప్పుడే వ్యవసాయ చట్టాల అమలులో బీజేపీ వెనక్కి తగ్గాల్సి వచ్చిందని, ఇక మిత్రపక్షాలపై ఆధారపడే స్థితిలో ఎలాంటి వివాదాస్పద చట్టాల జోలికీ ప్రధాని మోదీ వెళ్లరని భావిస్తున్నారు.

ఇక బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ ప్రభావమూ మూడో దఫా పాలనపై ఉంటుందని.. గతంలోలా మోదీ, షా ఇష్టమొచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్ఎస్ఎస్ ఒప్పుకోకపోవచ్చని బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే సీబీఐ, ఐటీ దాడులు, రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుల్లో జోక్యం చేసుకోవడం వంటివి తగ్గుతాయని భావిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో బీజేపీకి కష్టంగా మారిన మరో అంశం…కాంగ్రెస్ బలపడడం. పదేళ్లక్రితం అధికారంలోకి వచ్చిన దగ్గరినుంచి ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేతలంతా కాంగ్రెస్ ముక్తభారత్ నినాదం విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చారు. కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 సీట్లు సాధించింది. ఇది ప్రధానిని పునరాలోచనలో పడేసింది. అలాగే కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉన్న బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రచారానికీ ఈ ఎన్నికలు ఫుల్‌స్టాప్ పెట్టాయి. ఎన్డీఏ టీడీపీ, జేడీయూ వంటి పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితితో పాటు అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలపడడం బీజేపీకి కొత్త తలనొప్పిగా మారనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమిళనాడులో డీఎంకె, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ వంటి పార్టీల బలోపేతం బీజేపీ డబుల్ ఇంజిన్ నినాదానికి గొడ్డలిపెట్టుగా మారింది. మొత్తంగా ప్రధాని మోదీ మూడో విడత పాలన…అనుకున్నంత తేలికగా సాగే అవకాశం కనిపించడం లేదన్నది రాజకీయ నిపుణుల విశ్లేషణ.

Also Read : ఎన్డీయేలో కింగ్ మేకర్‌గా చంద్రబాబు..! ఈ గొప్ప అవకాశాన్ని ఎలా ఉయోగించుకుంటారు? ఏపీ కోసం ఏం చేయబోతున్నారు?