కచ్చతీవు ద్వీపం ఎక్కడుంది.. భారత్- శ్రీలంక వివాదం ఎందుకు.. దీని స్టోరీ ఏంటీ?

ఆర్టీఐ సమాచారం ప్రకారం ఓ న్యూస్‌ పేపర్‌లో వచ్చిన వార్తతో కచ్చతీవు హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత ప్రధాని మోదీ ట్వీట్ చేయడంతో రాజకీయ రచ్చ స్టార్ట్ అయింది.

కచ్చతీవు ద్వీపం ఎక్కడుంది.. భారత్- శ్రీలంక వివాదం ఎందుకు.. దీని స్టోరీ ఏంటీ?

Katchatheevu Island Issue: లోక్‌సభ ఎన్నికలకు ముందు తమిళనాడులో కచ్చతీవు ద్వీపం పొలిటికల్ హాట్ టాపిక్ అయింది. కాంగ్రెస్, డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. 1974లో నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఈ దీవిని శ్రీలంకకు అప్పనంగా అప్పగించారని నరేంద్ర మోదీ ఆరోపించారు. డీఎంకే కూడా కచ్చతీవుపై రెండు నాల్కల ధోరణి పాటించిందంటూ ప్రధాని మోదీ విమర్శలు చేయడంతో ఈ అంశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తమిళనాడులోని రామేశ్వరానికి 33 కిలోమీటర్ల దూరంలో, శ్రీలంకలోని జాఫ్నాకు 62 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో కచ్చతీవు దీవి ఉంది. స్వాతంత్రానికి ముందు ఈ దీవి బ్రిటిష్ పాలకుల పరిధిలోని మద్రాస్ ప్రెసిడెన్సీ ఆధీనంలో ఉండేది. స్వాతంత్ర్యం తర్వాత భారత్, శ్రీలంక ఈ దీవి తమకే చెందుతుందని ప్రకటించుకున్నాయి. అప్పటినుంచి రెండు దేశాల మధ్య కచ్చతీవుపై వివాదం కొనసాగుతుంది.

కచ్చతీవు సమస్యను శాశ్వతంగా పరిష్కరించే ఉద్దేశంతో 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ లంకతో రాజీకి సిద్ధపడ్డారు. ఇండో శ్రీలంకన్ మారిటైం అగ్రిమెంట్ పేరుతో కచ్ఛతీవు దీవిపై హక్కును వదులుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం భారత జాలర్లు ఈ దీవి పరిధిలోని సముద్ర జలాల్లోనూ చేపల వేట సాగించొచ్చు. కానీ లంక ప్రభుత్వం ఈ నిబంధనను పట్టించుకోలేదు. భారత జాలర్లు కేవలం విశ్రాంతి తీసుకొనేందుకే ఈ దీవికి రావొచ్చని, తమ దీవి పరిధిలో చేపల వేటను అంగీకరించబోమని వాదించింది.

Also Read: భార్య, భర్త, మరో మహిళ… హోటల్ గదిలో శవాలుగా.. అసలు ఏం జరిగింది?

అంతకముందు పెద్దగా పట్టించుకోని శ్రీలంక.. 2009 నుంచి కచ్చతీవు దగ్గర బలగాలను మోహరించి.. దీవి దగ్గరకు వెళ్లే భారత జాలర్లను అరెస్టు చేస్తూ వస్తోంది. అప్పటి నుంచి ఈ దీవిని భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్లు తమిళనాడు ప్రజల నుంచి వస్తున్నాయి. 2011లో నాటి తమిళనాడు సీఎం జయలలిత ఈ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేయడంతోపాటు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రాజ్యాంగ సవరణ చేయకుండా ఈ దీవిని లంకకు అప్పగించడం చెల్లదని వాదించారు. అంతకముందు 2006లో నాటి డీఎంకే అధినేత కరుణానిధి ఈ అంశంపై నాటి ప్రధాని మన్మోహన్‌కు లేఖ రాశారు. 2023లో తమిళనాడు ప్రస్తుత సీఎం, కరుణానిధి కుమారుడు స్టాలిన్ సైతం ప్రధాని మోదీకి మరో లేఖ రాశారు.

Also Read: ఆప్‌ అగ్రనాయకత్వమంతా తీహార్ జైలులోనే.. ఈ నలుగురు వెళ్లింది అవినీతి కేసుల్లోనే..

ఆర్టీఐ సమాచారం ప్రకారం ఓ న్యూస్‌ పేపర్‌లో వచ్చిన వార్తతో కచ్చతీవు హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత ప్రధాని మోదీ ట్వీట్ చేయడంతో రాజకీయ రచ్చ స్టార్ట్ అయింది. తమిళనాడు ప్రజలు ఎక్కువగా చేపలవేటపై ఆధారపడి బతుకుతుండటంతో పార్టీలన్నీ ఈ ఎజెండాను ఎత్తుకున్నాయి.

Also Read: విస్తారా పైలట్లు మూకుమ్మడి సిక్ లీవ్‌లు .. భారీగా రద్దవుతున్నవిమాన సర్వీసులు

డీఎంకే, కాంగ్రెస్‌ కేంద్రాన్ని కార్నర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. కేంద్రం వాదన మాత్రం భిన్నంగా ఉంది. 1974లో కచ్చతీవును కాంగ్రెస్‌ ప్రభుత్వం వదులుకుందని.. 1976లో చేపలవేటపై కూడా హక్కులు వదులుకున్నారని వాదిస్తోంది కేంద్రం. అందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు కేంద్రమంత్రులు. కచ్చతీవు విషయంలో గతంలో ఏమీ జరగనట్లు కాంగ్రెస్, డీఎంకే చెప్తుండటం జోక్‌గా ఉందంటున్నారు. 20ఏళ్లలో వేలమంది మత్స్యకారులను, బోట్లను శ్రీలంక తమ అదుపులోకి తీసుకుందని చెప్తోంది కేంద్రం. కచ్చతీవును తిరిగి స్వాధీనం చేసుకుంటారో లేదో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం రాజకీయ రగడకు ఈ అంశం కారణం అవుతోంది.