తెలంగాణ నుంచి కేంద్రమంత్రులు అయ్యేదెవరు.? ఆ 8మందిలో అవకాశం దక్కేది ఎవరికి?

ప్రధాని మోదీతో పరిమిత సంఖ్యలో కేంద్రమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తే..తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. పూర్తిస్థాయి క్యాబినెట్‌ కొలువుదీరితే మాత్రం..తెలంగాణ నుంచి ముగ్గురు ఓత్ తీసుకుంటారని తెలుస్తోంది.

తెలంగాణ నుంచి కేంద్రమంత్రులు అయ్యేదెవరు.? ఆ 8మందిలో అవకాశం దక్కేది ఎవరికి?

Telangana Mps : కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ నుంచి 8 ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఆ 8మందిలో కేంద్ర మంత్రులు అయ్యేది ఎవరు? నరేంద్ర మోదీతో పాటు ప్రమాణస్వీకారం చేసే నేతలు ఎవరు? తెలంగాణ నుంచి సెంట్రల్ క్యాబినెట్ లో ఎంతమందికి అవకాశం దక్కనుంది. అమాత్యులుగా పదవులు ఆశిస్తున్న నేతలు ఎవరెవరు?

కనీసం ముగ్గురికి పదవులు..?
ముచ్చటగా మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. జూన్ 9న ప్రధాని మోదీ థర్డ్ టైమ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్రమంత్రులుగా తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం దక్కనుందనే చర్చ మొదలైంది. తెలంగాణ నుంచి కనీసం ముగ్గురు ఎంపీలకు కేంద్ర క్యాబినెట్‌లో అవకాశం కల్పిస్తారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.

పదువులు 3.. రేసులో ఐదుగురు..!
గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి నలుగురు ఎంపీలు గెలిచారు. ఇందులో నలుగురు కొత్తవాళ్లు కావడంతో సీనియర్ నాయకుడైన కిషన్‌రెడ్డికి ముందుగా కేంద్రహోంశాఖ సహాయ మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత క్యాబినెట్ మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు. ఇప్పుడు ఎనిమిది మంది ఎంపీలు గెలవడంతో మూడు కేంద్రమంత్రి పదవులు వస్తాయని భావిస్తున్నారు. ఇందులో ఒకటి క్యాబినెట్, ఒకటి ఇండిపెండెంట్, మరోటి కేంద్ర సహాయ మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీటి కోసం బీజేపీ నుంచి ఐదుగురు నేతలు పోటీ పడుతున్నారు.

రేసులో ఈటల, బండి సంజయ్..
కేంద్రమంత్రి పదవి ఆశిస్తున్నవారిలో కిషన్ రెడ్డితో పాటు రేసులో ఈటల రాజేందర్, బండి సంజయ్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్ ఉన్నారు. ఇప్పటికే కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి మరోసారి అవకాశం దక్కుతుందనే చర్చ నడుస్తోంది. ఆయన సేవలను పార్టీ బలోపేతం కోసం జాతీయ స్థాయిలో వాడుకోవాలని సెంట్రల్ పార్టీ భావిస్తే మాత్రం.. ఆయన స్థానంలో మరొకరి కేంద్రమంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. రెండుసార్లు రాష్ట్రమంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ కేంద్రమంత్రి పదవిని ఆశిస్తున్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం పనిచేసిన బండి సంజయ్ ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌కి ఈసారి కేంద్రమంత్రిగా అవకాశం దక్కుతుందనిప్రచారం జరుగుతోంది.

బండి సంజయ్, అర్వింద్‌లో ఒకరికే ఛాన్స్..!
ఇక రాష్ట్రమంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ కూడా మహిళ కోటాలో అవకాశం వస్తుందని భావిస్తున్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన ధర్మపురి అర్వింద్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. గత ప్రభుత్వంలోనే అర్వింద్‌కు కేంద్ర సహాయ మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ అవకాశం దక్కలేదు. ఈసారి మాత్రం తనకు తప్పకుండా అవకాశం ఉంటుందనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్, అర్వింద్‌లో ఒకరికి మాత్రమే అవకాశం దక్కనున్నట్లు టాక్.

ప్రధాని మోదీతో పరిమిత సంఖ్యలో కేంద్రమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తే..తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. పూర్తిస్థాయి క్యాబినెట్‌ కొలువుదీరితే మాత్రం..తెలంగాణ నుంచి ముగ్గురు ఓత్ తీసుకుంటారని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లోనే కేంద్ర క్యాబినెట్‌లో అవకాశం దక్కే తెలంగాణ ఎంపీలు ఎవరో తేలిపోనుంది.

Also Read : మోదీ 3.0 ఎలా ఉండబోతోంది..? మిత్రపక్షాల నుంచి ఎదురయ్యే సవాళ్లు ఏంటి? దూకుడు తగ్గించాల్సిందేనా?