Lok Sabha Elections 2024: బీజేపీ మనసు మారడానికి కారణాలేంటి? దీంతో మళ్లీ అధికారంలోకి వస్తుందా?

ప్రస్తుతం బీజేపీ రెండు విధాల ప్రణాళికలు అమలు చేస్తోంది. ఒకటి రాష్ట్రాల్లో మిత్రపక్షాల కోసం...

Lok Sabha Elections 2024: బీజేపీ మనసు మారడానికి కారణాలేంటి? దీంతో మళ్లీ అధికారంలోకి వస్తుందా?

Amit shah, Narendra Modi

Updated On : July 15, 2023 / 11:46 AM IST

Lok Sabha Elections 2024 – BJP: దేశంలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ వచ్చే ఎన్నికల్లోనూ విజయానికి ఇప్పటికే ప్రణాళికలు రచించుకుంది. వాటిని అమలు చేయడంపై దృష్టి పెట్టింది. ఈ సమయంలో ఆ పార్టీ మిత్ర పక్షాలు, పొత్తులపై తమ మనసును మార్చుకున్నట్లు స్పష్టమవుతోంది.

లోక్‌సభ ఎన్నికలకు మరో పది నెలల సమయం మాత్రమే ఉంది. ఎన్డీఏ(National Democratic Alliance)లో ఇప్పటికే అనేక పార్టీలు ఉన్నాయి. అయినప్పటికీ, మరిన్ని కొత్త పార్టీలను చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇతర అన్ని పార్టీలలాగే ఎన్నికల ముందు బీజేపీ.. ఇతర పార్టీలతో కలిసి మరింత బలాన్ని పెంచుకోవడానికి ప్రణాళికలు వేసుకుంది.

కొత్త మిత్రులతో పాటు పాత మిత్రులను మళ్లీ ఎన్డీఏలో చేర్చుకోవడం ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో వీలైనన్ని అధికంగా సీట్లను గెలుచుకోవాలని భావిస్తోంది. ఇదే లక్ష్యంతో ఇప్పటికే పంజాబ్ లోని షిరోమణీ అకాలీ దళ్, ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ, బిహార్ లోని హిందుస్థానీ పబ్లిక్ మోర్చా, వికాశీల్ ఇన్సాన్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), కర్ణాటకలోని జేడీఎస్, ఉత్తరప్రదేశ్ లోని ఓం ప్రకాశ్ రాజ్‌భర్ తో ఇప్పటికే బీజేపీ సంప్రదింపులు జరిపింది.

ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గిందా?

లోక్‌సభ ఎన్నికలు-2024కు ముందు బీజేపీ తన వైఖరిని ఒక్కసారిగా మార్చుకోవడం ఆసక్తి రేపుతోంది. 2019 ఎన్నికల్లో బీజేపీకి తిరుగులేని మెజారిటీ వచ్చింది. అప్పటినుంచి తమకు అసలు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే అవసరమే లేదన్నట్లు వ్యవహించింది. ఎన్డీఏ నుంచి కొన్ని పార్టీలు వెళ్లిపోతున్నప్పటికీ కనీసం ఆయా పార్టీలను వెళ్లకుండా ఆపి, తిరిగి చేర్చుకునే ప్రయత్నాలు కూడా చేయలేదు.

ఇప్పుడు మాత్రం తమ పార్టీ మరికొన్నేళ్ల పాటు అధికారంలో ఉండాలంటే మిత్రపక్షాలు అవసరమన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మిత్రపక్షాల కోసం అన్వేషిస్తోంది. దీంతో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని భావిస్తోందా? కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మిత్రపక్షాలు వీలైనన్ని ఎక్కువగా ఉండడం మంచిదని అనుకుంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కర్ణాటక ఎన్నికల తర్వాత..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బీజేపీలో ఓ కుదుపు తెచ్చిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలా ఓడిపోతామని బీజేపీ ఊహించలేదు. కర్ణాటకలో గెలుపుకోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ పార్టీ విజయం సాధించలేదు. ఇవే ఫలితాలు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎదురైతే ఎలాగని కమలనాథుల్లో కలవరం మొదలైందని విశ్లేషకులు అంటున్నారు.

మోదీ, హిందుత్వ మ్యాజిక్ ఇకపై పనిచేయదన్న సంకేతాలు ఇచ్చిందని చెబుతున్నారు. దీంతో బీజేపీ తన వ్యూహాలను మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. వరుసగా పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై సాధారణంగానే ప్రజల్లో వ్యతిరేకత అధికంగా ఉంటుంది.

వరుసగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆ పార్టీకి 2019 లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే 2024లో అధిక మెజారిటీ వస్తుందని మొదట అంచనాలు ఏర్పడ్డాయి. ఆయా రాష్ట్రాల్లో అంతకుముందు అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ తమపై ప్రజా వ్యతిరేకత ప్రభావం పడకుండా చూసుకోగలిగింది.

ఇక బీజేపీకి తిరుగులేదని భావించింది. అయితే, హిమాచల్ ప్రదేశ్‌, కర్ణాటక ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఊహించని షాక్ తగలడంతో బీజేపీ పునరాలోచనలో పడింది. బీజేపీ నిజానిజాలను గ్రహించి ఇప్పుడు అప్రమత్తమైంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ లోనూ ఓడే అవకాశాలు ఉన్నాయని బీజేపీ ముందుగానే గ్రహించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ రెండు విధాల ప్రణాళికలు అమలు చేస్తోంది.  ఒకటి రాష్ట్రాల్లో మిత్రపక్షాల కోసం అన్వేషించడమైతే, రెండోది ప్రతిపక్షాలను బలహీనపర్చడం.

TPCC Campaign Committee : టీపీసీసీ ప్రచార కమిటీ నియామకం… పొంగులేటికి కీలక పదవి