మోడీ ర్యాలీ కోసం చెట్ల నరికివేత..సమర్థించుకున్న బీజేపీ

  • Published By: venkaiahnaidu ,Published On : October 16, 2019 / 03:35 PM IST
మోడీ ర్యాలీ కోసం చెట్ల నరికివేత..సమర్థించుకున్న బీజేపీ

Updated On : October 16, 2019 / 3:35 PM IST

గురువారం పూణెలో ప్రధాని మోడీ బహిరంగ సభ కోసం చెట్ల నరికివేతపై కాంగ్రెస్,ఎన్సీపీ తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నాయి.  ఇటీవల ముంబైలోని అరే ఏరియాలో చెట్ల నరికివేత విషయంలో ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీకి ఇప్పుడు మరో తలనొప్పి ఎదురైంది.  

అక్టోబర్-21,2019న జరగనున్నమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రధానమంత్రి రాష్ట్రంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. గురువారం(అక్టోబర్-17,2019) పూణెలో మోదీ బహిరంగ సభ ఉంది. పర్శురాం కాలేజ్ క్యాంపస్‌లో ఏర్పాటు చేస్తోన్న వేదికకు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే దీని కోసం క్యాంపస్‌లోని చెట్లను నరికివేశారని కాంగ్రెస్, ఎన్సీపీ సహా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం పర్యావరణాన్ని పాడు చేస్తున్నారని బీజేపీపై మాటల దాడికి దిగాయి. మోడీకి రాజకీయ ప్రయోజనాలే కానీ, దేశ ప్రయోజనాలు ఏమీ పట్టవని విమర్శించాయి.
 
అయితే మోడీ ర్యాలీ కోసం చెట్ల నరికివేతను కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జావడేకర్ సమర్ధించుకున్నారు. చెట్లను నరికివేసిన ప్రాంతంలోనే మళ్లీ కొత్త మొక్కల్ని నాటుతామని అన్నారు. పర్యావరణంపై కాంగ్రెస్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని, తాము అధికారంలోకి వచ్చాక దేశంలో అడవుల సంరక్షణపై ఎక్కువ శ్రద్ధ పెట్టామని జావడేకర్ అన్నారు. గతంలో కూడా ఇలా చాలాసార్లు జరిగిందని,అప్పుడు కూడా చాలా ఎక్కువ మొక్కలు నాటబడ్డాయన్నారు.