ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు వేధింపులు.. ఇండోర్‌లో ఏం జరిగింది? నిందితుడు ఇతడే.. అరెస్ట్..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బైక్‌పై వచ్చిన ఆకిల్ ఖాన్ అనే వ్యక్తి ఇద్దరు మహిళా క్రికెటర్లను వెంబడించి, వారిలో ఒకరిని అనుచితంగా తాకాడు.
వరల్డ్ కప్‌లో ఆడేందుకు ఇండియాకు వచ్చిన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లలో ఇద్దరికి చేదు అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను ఒక వ్యక్తి బైక్‌పై వెంబడించి వేధించాడనే ఆరోపణలు వచ్చాయి. గురువారం జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
పోలీసులు ఏం చెప్పారు?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బైక్‌పై వచ్చిన ఆకిల్ ఖాన్ అనే వ్యక్తి ఇద్దరు మహిళా క్రికెటర్లను వెంబడించి, వారిలో ఒకరిని అనుచితంగా తాకాడు. ఈ సంఘటన ఖజ్రానా రోడ్డులో ఉదయంపూట జరిగింది. ఆస్ట్రేలియా క్రికెటర్లు రాడిసన్ బ్లూ హోటల్ నుంచి ఒక కేఫ్‌కు నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు చెప్పారు.
సబ్ ఇన్‌స్పెక్టర్ నిధి రఘువంశీ మీడియాకు వివరాలు తెలిపారు. ఇద్దరు మహిళా క్రికెటర్లు నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్‌పై వచ్చిన వ్యక్తి వారిని వెంబడించి, ఒకరిని తాకి అక్కడి నుంచి పారిపోయాడని అన్నారు.
ఈ ఘటన జరిగిన తర్వాత, ఆ ఇద్దరు క్రికెటర్లు తమ టీమ్ సెక్యూరిటీ ఆఫీసర్ డ్యానీ సిమ్మన్స్‌కు ఈ విషయం చెప్పారు. ఆయన వెంటనే పోలీసులను సంప్రదించారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హిమాని మిశ్రా వచ్చి ఆ ఇద్దరు ఆటగాళ్ల వాంగ్మూలాలు తీసుకున్నారు. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
నిందితుడి అరెస్ట్

నిందితుడు ఆకిల్ ఖాన్
ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఒక వ్యక్తి నిందితుడి బైక్ నంబర్‌ను చూశాడు. ఆ నంబర్ ఆధారంగా పోలీసులు ఆకిల్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. “ఖాన్‌పై గతంలో కూడా కేసులు ఉన్నాయి, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది” అని అధికారి నిధి రఘువంశీ చెప్పారు. కాగా, అక్టోబర్ 25న (నేడు) ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతోంది.
