అమ్మాయిలా వేషం వేసుకుని.. పొరుగింటి మహిళ కళ్లల్లో కారం కొట్టి.. బంగారం దోచుకున్న యువకుడు
నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు దొరికాడు.

అమ్మాయిలా వేషం వేసుకుని వచ్చి పొరుగింటి మహిళపై దాడి చేసి బంగారం, నగదు దోచుకున్నాడు ఓ యువకుడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చివరకు ఆ యువకుడిని అరెస్టు చేశారు. గుజరాత్‌లోకి కచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
హర్ష్ పటేల్ అనే యువకుడు గత ఏడు నెలలుగా అహ్మదాబాద్‌లో చిరు ఉద్యోగం చేస్తున్నాడు. పని చేస్తే వస్తున్న జీతం సరిపోవట్లేదని కొంత కాలంగా బాధపడుతున్నాడు. ఇంకొకరిపై దాడి చేసి, దోచుకోనైనా సరే డబ్బులు సంపాదించాలని చెడు మార్గంలో ఆలోచించాడు.
తమ పొరుగింట్లోకి చొరబడి, మహిళపై దాడి చేసి డబ్బులు లాక్కోవాలనుకున్నాడు. చోరీ చేసినా దొరికిపోకుండా ఉండడానికి యువతిలా వేషం వేసి దోపిడీకి వెళ్లాలని భావించాడు. అచ్చం అమ్మాయిలా తయారై, ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని పొరుగింటి మహిళ మంజుల పటేల్ ఇంట్లోకి వెళ్లాడు.
పొరుగింటి మహిళ కంట్లో కారం కొట్టి, ఆమెపై దాడి చేసి రూ.1.15 లక్షల విలువైన బంగారాన్ని, రూ.35 వేలను దోచుకున్నాడు. దీనిపై ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.
దాదాపు 198 సీసీటీవీ కెమెరాల నుంచి ఫుటేజీని తీసుకుంది సిట్. అలాగే, 900 జీబీ డేటాను విశ్లేషించింది, చివరికి నేరస్తుడిని గుర్తించింది. యువకుడే నేరం చేస్తున్న సమయంలో మహిళగా మారువేషంలో తిరిగాడని పోలీసులు గుర్తించారు. నిందితుడు హర్ష్ పటేల్ అహ్మదాబాద్ నుంచి గాంధీదామ్‌కు ట్రైనులో వెళ్తున్నట్లు తెలుసుకుని పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.
Mla Sanjay Kumar : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై స్పీకర్ కు ఫిర్యాదు..