వైసీపీలోకి వలసల పరంపర : అదాల.. ఎందుకిలా?
నెల్లూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగలింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సడన్‌గా సైకిల్ దిగిపోయారు.

నెల్లూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగలింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సడన్‌గా సైకిల్ దిగిపోయారు.
నెల్లూరు : వైసీపీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా నుంచి మరో టీడీపీ సీనియర్ నేత ఆదాల వైసీపీ గూటికి చేరారు. టీడీపీలో జరుగుతున్న పరిణామాల వల్లే.. ఆయన పార్టీ వీడాలని డిసైడ్ అయ్యారా.. ఇప్పటికే తెలుగుదేశం తరపున అభ్యర్ధిగా బరిలో నిలిచి.. ప్రచారం కూడా ప్రారంభించి.. సడన్‌గా ఎందుకు ఆయన అధినేతకు ఆయన షాక్ ఇచ్చారు…? టీడీపీలో జరుగుతున్న పరిణామాలే ఆయన అలకకు కారణమా..
నెల్లూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగలింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సడన్‌గా సైకిల్ దిగిపోయారు. వైసీపీ తరపున నెల్లూరు పార్లమెంట్ బరిలో ఆయన దిగే అవకాశం ఉంది. టీడీపీ టికెట్ కేటాయించాక, ప్రచారంలో కూడా దిగిన ఆదాల ఎందుకు హఠాత్తుగా ప్లేట్ ఫిరాయించారన్నది జిల్లాలో చర్చకు దారితీసింది. అయితే పార్టీలో పరిణామాలే పార్టీ మార్పునకు కారణాలుగా ఆదాల చెబుతున్నట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ ఆదాలను నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్‌గాను, రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ గానూ నియమించింది. 3 నెలల క్రితం ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ గా మార్చింది. ఈసారి కూడా ఆదాలను మళ్లీ నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించాలని అధికార పార్టీ భావించింది. మొదట్లో ఇందుకు సంసిద్ధంగానే కనిపించిన ఆదాల… తర్వాత మనసు మార్చుకున్నారు. నియోజకవర్గ నేతలతో ఉన్న విభేదాలతో అసెంబ్లీకే పోటీ చేయాలనుకున్నారు. కోవూరు నుంచి కానీ కావలి నుంచి కానీ పోటీ చేస్తానని పార్టీ అధిష్టానాన్ని కోరారు. అయితే హైకమాండ్ మాత్రం ఆదాలకు ఇష్టం లేకపోయినా ఒప్పించి నెల్లూరు రూరల్ సీటు ఖరారు చేసింది.
ఆదాల పార్టీ మారడానికి మరో కారణం మంత్రి సోమిరెడ్డిగా చెబుతున్నారు. ఈ ఇద్దరికీ మధ్య ఎన్నో ఏళ్లుగా రాజకీయ వైరం నడుస్తోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సోమిరెడ్డికి మంచి పట్టు౦ది. ఇక్కడ పోటీ చేస్తే సోమిరెడ్డి ఓడిస్తారనే కారణంగానే .. ముందు నుంచి ఆదాలకు ఈ సీటుపై ఆసక్తి చూపలేదు. అయినా చంద్రబాబు ఇచ్చిన ధీమాతో నెల్లూరు రూరల్ బరిలో దిగారు ఆదాల. కానీ పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదన్నది ఆదాల వాదన. నియోజకవర్గంలో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులంతా .. సోమిరెడ్డి వర్గం. వీరంతా ఆదాలకు సహకరించడంలేదని ఆదాల వర్గీయులు అంటున్నారు. మరోవైపు ఆదాలకు రావాల్సిన కాంట్రాక్టు బిల్లులు కొంత మేరే వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాతే ఆదాల ప్రచారం నుంచి హఠాత్తుగా వెళ్లిపోయారని టీడీపీ నేతలు అంటున్నారు.
ఆదాల గత ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత .. టీడీపీ అధిష్టానం ఆయనకు రాజ్యసభ కానీ , ఎమ్మెల్సీ పదవి కానీ ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఈ హామీలేవీ నెరవేర్చలేదు. మరోవైపు పార్టీలో తనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదని ఆదాల ఆగ్రహంగా ఉన్నారు. కనీసం ఇంచార్జిగా ఉన్న నియోజకవర్గాల పరిధిలో అధికారుల బదిలీలు కానీ, కొత్త వారికి పోస్టింగ్‌ల విషయంలో కానీ తన మాట చెల్లుబాటు కావడం లేదంటున్నారు. మొత్తం జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మాట ప్రకారం నడిచేది. దీంతో ఆదాల పార్టీలో ఉన్నప్పటికీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి కూడా ఆయన పార్టీ మారడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా కనిపిస్తోంది.
ఆదాల వైసీపీలోకి వెళ్లిపోతున్నారన్న విషయం తెలియడంతో .. ఒక్కసారిగా జిల్లా టీడీపీలో కలకలం రేగింది. మంత్రి నారాయణ జిల్లాలో ఉన్న టీడీపీ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. ప్రచారం కూడా మొదలుపెట్టి ఇలా షాకివ్వడాన్ని .. పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఒకవేళ ఆదాల నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే .. నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.