టీడీపీని వీడిన మరో నేత : వైసీపీలోకి రఘురామ కృష్ణంరాజు 

  • Published By: chvmurthy ,Published On : March 3, 2019 / 07:24 AM IST
టీడీపీని వీడిన మరో నేత : వైసీపీలోకి రఘురామ కృష్ణంరాజు 

Updated On : March 3, 2019 / 7:24 AM IST

హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామిక వేత్త, తెలుగుదేశం పార్టీ నరసాపురం లోక్‌సభ కన్వీనర్ రఘురామకృష్ణంరాజు ఆదివారం వైసీపీలో చేరారు.  లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్ ఆయన్ను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఆపార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, సీనియర్‌ నేతలు ఉన్నారు. కాగా… పారిశ్రామికవేత్తగా, టీడీపీ నేతగా రఘురామకృష్టంరాజు నరసాపురం పార్లమెంట్ పరిధిలో సుపరిచితులు. ఆయన టీడీపీని వీడడం ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీకి కొంతమేర నష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

వైసీపీ లో చేరిన అనంతరం ఆయన మాట్లాడుతూ “వైసీపీలో చేరడం తిరిగి సొంత గూటికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు”.  వైఎస్‌ జగన్‌ కుటుంబంతో మాకు అనుబంధం ఉంది. గతంలో కొన్ని మనస్పర్థల కారణంగా పార్టీ మారానని, ఇప్పుడు ఆ మనస్పర్థలు సమసిపోవడంతో తిరిగి పార్టీలో చేరినట్లు చెప్పారు. వైసీపీ తరఫున నర్సాపురం ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. తన ఎంపీ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను గెలిపించే భాద్యత తనదేనని రఘురాం కృష్ణంరాజు హమీ ఇచ్చారు.

ఏపీ అభివృద్ధి చెందాలంటే వైఎస్‌ జగన్‌ సీఎం కావాలని, విభజన హామీలు అమలుకావాలంటే జగన్‌ వల్లే సాధ్యమని ప్రజలు అంటున్నారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. విభజన హామీలు సాధించే సత్తా ఒక్క వైఎస్‌ జగన్‌కే ఉంది. తటస్తులు కూడా జగన్‌ సీఎం కావాలంటున్నారని ఆయన వివరించారు.