రోగులకు వరం : వైయస్సార్ ఆరోగ్య ఆసరా

దేశంలోని ఏ రాష్ట్రంలో లేని కొత్త పథకాలు ఆవిష్కరిస్తున్న సీఎం జగన్.. మరో స్కీమ్ కి శ్రీకారం చుట్టారు. సోమవారం(డిసెంబర్ 2,2019) నుంచి మరో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా పేద రోగులకు ఊరట కల్పించే పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్రచికిత్స చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం..విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లించే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రారంభించనున్నారు.
గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి దగ్గర ఉదయం 11.30 గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ పథకం ద్వారా రోజుకు 225 లేదా నెలకు గరిష్టంగా 5 వేలను సాయంగా ఇస్తారు. 3 నెలల పాటు రూ.5వేల చొప్పున అందించనున్నారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి రోగులకు ఈ తరహా చేయూత అందించడం భారత దేశంలో ఇదే ప్రథమం. కుటుంబ పెద్ద జబ్బున పడితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతోంది. ఈ స్కీమ్‌తో ఏటా నాలుగున్నర లక్షల మందికి లబ్ది చేకూరనుంది.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా లబ్ది పొందుతున్న రోగులతో సీఎం జగన్ మాట్లాడతారు. ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్స చేసుకున్న రోగులకు ఆయన చెక్కులను అందించనున్నారు. అంతేకాదు… ఆస్పత్రిలో కొత్తగా నిర్మించిన క్యాన్సర్ వార్డును ప్రారంభించనున్నారు. అనంతరం గుంటూరు మెడికల్ కాలేజ్ జింఖానా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు. చిన్న పిల్లలకు సంబంధించిన కాంక్లియర్ ఇంప్లాంట్స్‌కు సంబంధించి బ్రోచర్‌ను ఆవిష్కరిస్తారు.
ఎవరు అర్హులు
26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ఇది వర్తించనుంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 48 గంటల్లో విశ్రాంతి తీసుకునే కాలానికి రోగుల అకౌంట్లలో నేరుగా నగదు జమ చేస్తారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం రెండు రోజుల క్రితమే జారీచేసింది. రోగి డిశ్చార్జి అయ్యే సమయంలో బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాంకు ఖాతా లేకపోతే బంధువుల బ్యాంకు ఖాతా ఇస్తే దానికి సొమ్మును జమచేస్తారు.
రోగులు ఆర్ధికంగా ఇబ్బంది పడకూడదు
వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకానికి ఏటా రూ.270 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకూ వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఈ పథకంలో ప్రభుత్వం సాయం అందిస్తుంది.
వైఎస్సార్ ఆసరా వివరాలు
మొత్తం స్పెషాలిటీ విభాగాలు 26
ఎన్నిరకాల శస్త్ర చికిత్సలు 836
రోజుకు ఇచ్చే మొత్తం రూ.225
నెల రోజుల విశ్రాంతికి రూ.5000
లబ్ధిదారుల సంఖ్య 4.50 లక్షలు
ఏటా వ్యయం దాదాపు రూ.300 కోట్లు