ఇళ్ళ పట్టాల పంపిణీ ఏప్రిల్ 14కి వాయిదా : ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం

  • Published By: chvmurthy ,Published On : March 20, 2020 / 10:59 AM IST
ఇళ్ళ పట్టాల పంపిణీ ఏప్రిల్ 14కి వాయిదా : ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం

Updated On : March 20, 2020 / 10:59 AM IST

ఆంధ్రప్రదేశ్ లో ఉగాది రోజు పేదలకు పంపిణీ చేసే ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ,కరోనా వైరస్ నిరోధంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో సీఎస్‌ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు హాజరయ్యారు. జిల్లాల వారీగా ఇళ్ల పట్టాలు, ప్లాట్ల అభివృద్ధిపై సీఎం సమీక్షించారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ నివారణకు చర్యలు చేపడుతున్నందున ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
 

ఏప్రిల్‌ 14 అంబేద్కర్‌ జయంతి రోజున ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు సీఎం వివరించారు. లబ్ధిదారులు అందరికీ ఒకేసారి కాకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ జాగ్రత్తలు తీసుకొని వారికి ఇళ్ల సైట్లను చూపించాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. మొదట ఉగాది పండుగ రోజున అర్హులైన పేదలకు ఇళ్లపట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నా, కరోనా వైరస్ వల్ల ఏర్పడుతున్న ప్రమాదం నివారణ చర్యల్లో భాగంగా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. 
 

కరోనా విషయంలో నో టూ పానిక్‌… ఎస్‌ టూ ప్రికాషన్స్‌ అన్నది నినాదంగా ఉండాలన్నారు సీఎం జగన్‌.  అలాగే నిత్యావసర వస్తువుల ధరలపై పర్యవేక్షణ చేయాలని, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా నిత్యావసర వస్తువులపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఒకవేళ కొంతమంది కరోనాను సాకుగా తీసుకుని ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందనే విషయాన్ని వ్యాపారస్తులకు తెలియచేయాలన్నారు. 

కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. దాదాపుగా ట్రీట్‌మెంట్‌ తీసుకున్నట్టేనని, దీన్ని అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలకు తెలియజేశారు జగన్. ఆర్టీసీ బస్సులో నిండుగా ప్రయాణికులను తీసుకెళ్లడానికి వీల్లేదని, బస్సుల్లో శుభ్రత పాటిస్తున్నారా? వాటిని శానటైజ్‌ చేస్తున్నారా? లేదా? అన్నది చూడాలన్నారు. టాస్క్‌ ఫోర్స్‌ ఈ అన్ని అంశాలమీద దృష్టిపెట్టాలన్నారు. జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో పెట్టిన ఐసోలేషన్‌ వార్డుల మీద కలెక్టర్లు తనిఖీలు చేసి పర్యవేక్షణ చేయాలన్నారు. 21 ఔషధాలు ఉంచాలని కేంద్ర ప్రభుత్వం, డబ్ల్యూహెచ్‌ఓ, ఐసీఎంఆర్‌ సూచిస్తోందనే విషయాన్ని సీఎం అధికారులకు తెలిపారు.