ఏపీ మంత్రి కొడుక్కి గిఫ్ట్‌గా బెంజ్ కారు ఇచ్చిన ఈఎస్ఐ స్కామ్ నిందితుడు, ఫొటో బయటపెట్టిన అయ్యన్న

  • Published By: naveen ,Published On : September 18, 2020 / 05:35 PM IST
ఏపీ మంత్రి కొడుక్కి గిఫ్ట్‌గా బెంజ్ కారు ఇచ్చిన ఈఎస్ఐ స్కామ్ నిందితుడు, ఫొటో బయటపెట్టిన అయ్యన్న

Updated On : November 6, 2020 / 3:43 PM IST

ఏపీ కార్మికశాఖా మంత్రి గుమ్మనూరు జయరాంపై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఈఎస్ఐ స్కామ్‌లో నిందితుల నుంచి మంత్రి కుమారుడు ఈశ్వర్‌కు బెంజ్ కార్ గిఫ్ట్‌గా ఇచ్చారంటూ ఆరోపించారాయన. ఈఎస్ఐ స్కామ్‌లో ఏ 14 నిందితుడు కార్తీక్..మంత్రి జయరామ్‌ కుమారుడికి ఖరీదైన కారుని గిఫ్ట్ గా అందించారంటూ ఆరోపించారు.

అంతేకాదు..ఏపీలో అవినీతిపై ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్‌కి ఫోన్ చేసి హంగామా చేశారు. మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఐతే దీనిపై మంత్రి జయరాం మండిపడ్డారు. కారు పక్కన ఫోటో ఉంటే..తమ కుమారుడి అవుతుందా అని ప్రశ్నించారు.



ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఈఎస్ఐ స్కామ్‌ వెనుక అసలైన సూత్రధారి బెంజ్‌ మినస్టర్‌ జయరామే అంటూ లోకేశ్‌ ట్విట్టర్‌ వేదికగా ఆరోపించారు. పనులు లేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. కార్మిక శాఖ మంత్రి మాత్రం ఈఎస్ఐ స్కామ్‌లో నిందితులు ఇచ్చిన బెంజ్‌ కారులో విలాసంగా తిరుగుతున్నారని లోకేశ్ విమర్శించారు.

అయ్యన్న ఆరోపణలపై మంత్రి జయరాం తీవ్రంగా స్పందించారు. అయ్యన్న ఆరోపణలను మంత్రి ఖండించారు. అయ్యన్నపాత్రుడు అసత్య ప్రచారం మానుకోవాలన్నారు. అభిమానుల కారుతో తన కుమారుడు ఫొటో మాత్రమే దిగాడని వివరణ ఇచ్చాడు. కారుతో ఫొటో దిగితే ఆ కారు నా కుమారుడి అయిపోతుందా? అని మంత్రి జయరాం నిలదీశారు. ఈఎస్ఐ స్కామ్ చేసింది అచ్చెననాయుడు కాదా? అని మంత్రి ప్రశ్నించారు. అప్పుడు జరిగిన స్కామ్ తో మాకేం సంబంధం అని అడిగారు.