టీడీపీలో కోట్ల చేరిక : ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారు

  • Published By: vamsi ,Published On : February 21, 2019 / 04:21 AM IST
టీడీపీలో కోట్ల చేరిక : ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తరాలుగా కాంగ్రెస్ లో ఉన్న నాయకులు సైతం ఇప్పుడు పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయించుకున్నారు. కర్నూలు జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం గూటికి చేరడం దాదాపు ఖరారైపోయింది. కోట్ల ఈనెల 28న టీడీపీలో చేరనున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరులో ఫిబ్రవరి 28వ తేదీన టీడీపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈసభకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానుండగా ఇదే వేదికపై కోట్ల కుటుంబం టీడీపీలోకి వెళ్లనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కోట్ల కుటుంబానికి  కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.
  

మన్మోహన్ హయాంలో రైల్వేశాఖ సహాయమంత్రిగా పనిచేసిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మరో రెండుమూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కర్నూలు పార్లమెంటు స్థానం నుండి తెలుగుదేశం తరుఫున పోటీ చేసేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. మరోవైపు, ఆలూరు, డోన్ అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా తమకు కేటాయించాలని కోట్ల కుటుంబం కోరగా.. డోన్ నుంచి కేఈ సీటు కోరుతుండడంతో ఆ సీటుపై ఇంకా క్లారిటీ రాలేదు.

 

ఆలూరు నుంచి మాత్రం కోట్ల సుజాతమ్మ పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే, సూర్యప్రకాశ్ రెడ్డి కుమారుడు రాఘవేంద్రరెడ్డికి కూడా పార్టీ తరుపున ఏదో ఒక పదవి దక్కే అవకాశం కనిపపిస్తుంది. గత ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు స్థానం నుండి ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కోట్లకు లక్ష ఓట్లకు పైగా రాగా.. తెలుగుదేశంలోకి మారితే విజయావకాశాలు ఎక్కువ అవ్వచ్చని కొట్ల కుటుంబం భావిస్తుంది.