అమరావతి కోసం సెల్ టవర్ ఎక్కి యువకులు ధర్నా

ఏపీ రాజధాని అమరావతి తుళ్లూరులో శనివారం హై డ్రామా చోటు చేసుకుంది. ఏపీ రాజధానిని అమరావతిలోనే కోనసాగించాలనిడిమాండ్ చేస్తూ నలుగురు యువకులు తుళ్లూరు గ్రామంలో సెల్ టవర్ ఎక్కారు. రాజధానిని అమరావతిలో కొనసాగించకపోతే తాము అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
స్దానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నరసరావు పేట నియోజకవర్గంలోకి వెళ్లి అక్కడ 3 రాజధానులు చేయాలని ప్రచారం చేస్తున్నారని ఈ విషయం తెలిసి యువకులు సెల్ టవర్ ఎక్కారని స్థానికులు తెలిపారు. ప్రవీణ్, బ్రహ్మయ్య, సాంబయ్య,శివ అనే నలుగురు యువకులు సెల్ టవర్ ఎక్కి ప్రాణాలైనా అర్పిస్తాం.. రాజధానిని సాధిస్తాం అంటూ నినాదాలు చేస్తున్నారు…ఇప్పటికైనా సీఎం జగన్ స్పందించి మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈవిషయాన్ని ఎమ్మెల్యే శ్రీదేవి కిచెపుతామని పోలీసులు చెప్పినప్పటికీ వారు కిందకు దిగి రాలేదు.
సెల్ టవర్ ఎక్కిన నలుగురు రైతులు గత ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేశామని చెపుతున్నారు. గత ప్రభుత్వం అడిగినప్పుడు 13 జిల్లాల వారు బాగుండాలనే ఉద్దేశంతో మేం భూములు ఇచ్చామని….. మిగిలిన రాష్ట్రం కూడా బాగుండాలని కోరుకున్నామనివారు పేర్కోన్నారు. ప్రధానమంత్రి మోదీ వచ్చి శంకుస్థాపన చేశారని…. జగన్‌కు చేతకాకపోతే ఆయన్ను దీన్ని అలాగే వదిలిపెట్టమనండి. మేమే అమరావతిని నిర్మిస్తామని వారు తెలిపారు. మేము చచ్చిపోయినా పర్వాలేదనుకుంటే ఇక్కడినుంచి దూకి చచ్చిపోతామని, ప్రభుత్వాన్ని నమ్మటమే మేము చేసిన పాపం అని వారు వాపోయారు.
జగన్, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు అందరికీ ఆఫీసులు, క్వార్టర్స్ కట్టిస్తాం. వారికి దండం పెడుతున్నాం. రాజధాని రైతులకు అన్యాయం చేయొద్దు. రాజధాని రైతులకు అండగా ఉంటామని చెప్పిన ప్రధాని మోదీ ఇప్పుడు నోరెత్తడం లేదు. పవన్ కళ్యాణ్ నిన్నటి వరకు మాతోనే ఉన్నారు. రేపు కూడా అలాగే ఉండాలి. పవన్ కళ్యాణ్ రైతుల తరఫున మాట్లాడాలని వారు కోరారు. స్ధానిక పోలీసులు వారితో సంప్రదింపులు జరిపి మొత్తానికి వారిని క్షేమంగా కిందకు దింపారు.