Gossip Garage: జిల్లా ఇంచార్జ్ మంత్రుల మార్పు వెనుక రీజనేంటి? ఆ ముగ్గురు సీనియర్లను ఎందుకు పక్కకు పెట్టినట్లు?

ఇంచార్జ్ మంత్రుల బాధ్యత‌ల విష‌యంలో మ‌రో ముగ్గురు మంత్రుల‌కు స్థాన చ‌లనం క‌లిగించారు సీఎం రేవంత్‌.

Gossip Garage: జిల్లా ఇంచార్జ్ మంత్రుల మార్పు వెనుక రీజనేంటి? ఆ ముగ్గురు సీనియర్లను ఎందుకు పక్కకు పెట్టినట్లు?

Updated On : June 16, 2025 / 12:51 AM IST

Gossip Garage: తెలంగాణ‌లో సీఎం రేవంత్ రెడ్డి ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత పాత సాంప్రదాయాన్ని మళ్లీ తీసుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాల‌కు ఇన్‌చార్జ్ మంత్రులను నియ‌మించే వారు. ఇంచార్జ్ మినిస్టర్ల ఆధ్వర్యంలో డెవ‌ల‌ప్‌మెంట్‌ కార్యక్రమాలు స్పీడప్ అయ్యేవి. కానీ తెలంగాణ వ‌చ్చాక ఈ సాంప్రదాయాన్ని పక్కన పెట్టారు. గ‌త ప‌దేళ్లుగా లేని ఇంచార్జ్ మంత్రుల పాల‌న‌కు సీఎం రేవంత్ రెడ్డి మ‌ళ్లీ మొదలుపెట్టారు. క్యాబినెట్‌లో 11 మంది మంత్రులు ఉంటే.. డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్కకు మిన‌హా మిగ‌తా ప‌ది మంది మంత్రుల‌కు ప‌ది ఉమ్మడి జిల్లాల బాధ్యత‌లు ఇచ్చారు. ఈ ఏడాదిన్నర కాలంగా ఇంచార్జ్ మంత్రి ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో కార్యక్రమాలు చేప‌ట్టారు. నియోజ‌క‌వ‌ర్గ డెవ‌ల‌ప్ మెంట్ ఫండ్స్ కూడా ఇంచార్జ్ మంత్రి క‌నుస‌న్నల్లోనే రిలీజ్ చేస్తున్నారు. ఇలా ప్రతీ కీల‌క‌మైన ప‌నికి ఇంచార్జ్ మంత్రి ఆమోదం ఉంటుండ‌టంతో..ఆ పోస్ట్‌కు ఫుల్ ప్రియారిటీ పెరిగింది.

మొత్తం ప‌ది ఉమ్మడి జిల్లాల‌కు ప‌ది మంది మంత్రుల‌కు ఇంచార్జ్ మంత్రిగా బాధ్యత‌ల‌ను సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. లేటెస్ట్‌గా ముగ్గురు మంత్రులు క్యాబినెట్‌లోకి రావ‌డంతో..పాత వారిలో ముగ్గురు మంత్రుల‌కు ఇంచార్జ్ బాధ్యత‌ల నుంచి ప‌క్కన పెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, కొండా సురేఖను ఏ జిల్లాకు ఇంచార్జ్‌గా నియమించలేదు.

అలాగే మ‌రో ముగ్గురు మంత్రుల‌కు ఇంచార్జ్ బాధ్యత‌ల‌ను మార్చారు. సీత‌క్క, తుమ్మల నాగేశ్వరరావు, జూప‌ల్లి కృష్ణారావుకు వేరే జిల్లాల బాధ్యతలు ఇచ్చారు. అయితే ముగ్గురు మంత్రుల‌కు ఏ జిల్లా బాధ్యత‌లు ఇవ్వకుండా ఎందుకు ప‌క్కన పెట్టార‌నేది పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో చ‌ర్చనీయాంశంగా మారింది.

మంత్రుల బాధ్యత‌ల‌ను మార్చడానికి కార‌ణం లేక‌పోలేద‌నే టాక్ వినిపిస్తోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేష‌న్ శాఖ మంత్రిగా ఫుల్ బిజీగా మారార‌ట‌. ప్రాజెక్టుల నిర్మాణం విష‌యంలో ఫాలో అప్ చేయ‌డం..నీటి కేటాయింపుల విష‌యంలో త‌ర‌చూ కేంద్రం దగ్గరకు వెళ్లాల్సి ఉంటుండంతో వ‌ర్క్ లోడ్ భారీగా పెరుగుతుంద‌ట. అందుకే ఇంచార్జ్ బాధ్యత‌ల నుంచి త‌ప్పించాల‌ని సీఎం కోర‌డంతో ఓకే చెప్పార‌ట‌.

అలాగే కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కూడా రీజ‌న‌ల్ రింగ్ రోడ్‌తో పాటు కీల‌క‌మైన మెట్రోరైల్ ఇత‌ర‌త్రా అభివృద్ధి కార్యక్రమాల‌పై బిజీగా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో కోమ‌టిరెడ్డి త‌న‌ను ఇంచార్జ్ బాధ్యత‌ల నుంచి త‌ప్పించాల‌ని కోరార‌ట‌. ఇక మ‌రోమంత్రి కొండా సురేఖ‌ను బాధ్యత‌ల నుంచి త‌ప్పించ‌డానికి వేరే కార‌ణం ఉంద‌ట‌. ఈ మ‌ధ్యకాలంలో మంత్రి కొండా సురేఖ‌కు ఆరోగ్యం స‌రిగ్గా ఉండ‌టం లేద‌ంటున్నారు. ఇంచార్జ్ మంత్రిగా ఫుల్ టైం ఇవ్వలేక‌పోతున్నట్లు సీఎంకు చెప్పార‌ట‌. అందుకే ఈ ముగ్గురి బాధ్యత‌ల‌ను మార్చార‌ట‌. దీంతో ఇంచార్జ్ మంత్రులుగా కొత్తగా క్యాబినెట్‌లో చేరిన గ‌డ్డం వివేక్‌, వాకిటి శ్రీహ‌రి, అడ్లూరి ల‌క్ష్మణ్‌ల‌కు ఛాన్స్ ద‌క్కింది.

ఇంచార్జ్ మంత్రుల బాధ్యత‌ల విష‌యంలో మ‌రో ముగ్గురు మంత్రుల‌కు స్థాన చ‌లనం క‌లిగించారు సీఎం రేవంత్‌. మంత్రి సీత‌క్కకు ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ జిల్లాకు మార్పు చేశారు. ఆదిలాబాద్ జిల్లా నేత‌ల‌తో మంత్రి సీత‌క్కకు గ్యాప్ పెరిగింది. అక్కడి నేత‌లు మంత్రి సీత‌క్కపై ప్రెస్‌మీట్ పెట్టి విమ‌ర్శలు చేశారు. దీంతో మంత్రి సీత‌క్క త‌న‌కు ఆ జిల్లా బాధ్యత‌లు వ‌ద్దంటూ సీఎంకు విన్నవించార‌ట‌. అందుకే ఆదిలాబాద్ జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లాకు మార్చారు.

మొన్నటి వ‌ర‌కు నిజామాబాద్ జిల్లా బాధ్యత‌లు చూసిన జూప‌ల్లి కృష్ణారావుకు ఆదిలాబాద్ జిల్లా బాధ్యత‌ల‌ను అప్పగించారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి త‌ప్పుకున్న కరీంన‌గ‌ర్ జిల్లా బాధ్యత‌ల‌ను తుమ్మల నాగేశ్వరరావుకు అప్పగించారు. మ‌రో మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి త‌ప్పుకున్న ఖమ్మం జిల్లా బాధ్యత‌ల‌ను వాకిటి శ్రీహ‌రికి ఇచ్చారు. మొత్తం మీద సీనియ‌ర్ మంత్రులు ప‌క్కకు త‌ప్పుకున్న నేప‌థ్యంలో కొత్త మంత్రుల‌కు ఛాన్స్ ద‌క్కింది. కొత్త మంత్రులు ఇంచార్జ్ జిల్లా బాధ్యత‌ల‌ను ఏ విధంగా నిర్వహిస్తార‌నేది మునుముందు వేచి చూడాలి.