Suryapet Constituency: సూర్యాపేట కాంగ్రెస్‌లో ఇంచార్జ్ వార్..! ఆ ముగ్గురిలో బాధ్యతలు ఎవరికి? మరోసారి ఆయనకు త్యాగం తప్పదా?

పటేల్‌ రమేష్‌రెడ్డి, సర్వోత్తమ్‌రెడ్డి, వేనారెడ్డి ఈ ముగ్గురిలో ఎవరికి సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జ్ పోస్ట్ దక్కాలన్నా..జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదని ఇచ్చే అవకాశం ఉండదంటున్నారు.

Suryapet Constituency: సూర్యాపేట కాంగ్రెస్‌లో ఇంచార్జ్ వార్..! ఆ ముగ్గురిలో బాధ్యతలు ఎవరికి? మరోసారి ఆయనకు త్యాగం తప్పదా?

Updated On : October 17, 2025 / 9:43 PM IST

Suryapet Constituency: అధికార కాంగ్రెస్‌కు ఆ నియోజకవర్గం ఓ పెద్ద ప్రశ్న. ఉమ్మడి జిల్లాలో ఏకపక్షంగా 11 సీట్లు గెలుచుకున్న అధికార కాంగ్రెస్‌..ఆ ఒక్క నియోజకవర్గాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. ఆ నియోజకవర్గంలో మొన్నటి దాకా హస్తం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నేత దివంగతులయ్యారు. దీంతో నియోజకవర్గ ఇంచార్జ్ రేసు తెరమీదకు వచ్చింది. ఆ సెగ్మెంట్‌ హస్తం పార్టీలో వర్గపోరు కొత్త టర్న్ తీసుకుంటుందా? ఆ ముగ్గురిలో కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు ఎవరికి?

సూర్యాపేట కాంగ్రెస్‌లో ఇంచార్జ్‌ రేసు కొత్త టర్న్‌ తీసుకుంటోంది. సూర్యాపేట, తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానై వ్యవహరించిన..రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఈ మధ్యే దివంగతులయ్యారు. దీంతో సూర్యాపేట కాంగ్రెస్ ఇంచార్జ్ రేసు స్టార్ట్ అయింది. దామోదర్ రెడ్డి రాజకీయ వారసుడిగా ఏఐసీసీ సభ్యుడుగా ఉన్న సర్వోత్తమ్ రెడ్డికి నియోజకవర్గ ఇంచార్జ్‌ ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు పటేల్‌ రమేష్‌ రెడ్డి ఎప్పటినుంచో సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జ్‌ పోస్ట్ కోసం కాచుకొని కూర్చున్నారు. 2018, 2023లో రెండుసార్లు సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించిన ఆయనకు నిరాశే మిగిలింది. ఆ రెండు ఎన్నికల్లో దామోదర్ రెడ్డికే టికెట్ ఇచ్చారు. అయితే పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్‌గా పటేల్ రమేష్ రెడ్డికి నామినేటేడ్ పదవి కట్టబెట్టారు సీఎం రేవంత్‌.

పటేల్‌ రమేష్ రెడ్డికి.. ఆ ఇద్దరి నుంచి కాంపిటీషన్..

దామోదర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పటి నుంచే నియోజకవర్గ ఇంచార్జ్‌ పోస్ట్ కోసం ప్రయత్నాలు చేశారట రమేష్ రెడ్డి. పెద్దాయన అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన పోస్ట్‌ను మరొకరికి ఇస్తే బాగోదని పార్టీ పెద్దలు నచ్చచెప్పారట. అయితే దామోదర్‌రెడ్డి మరణం తర్వాత ఇంచార్జ్ నియామకంపై మరోసారి చర్చ జరుగుతోంది. దామోదర్‌రెడ్డి కుమారుడు సర్వోత్తమ్‌రెడ్డితో పాటు దామోదర్‌రెడ్డి సన్నిహితుడు సూర్యాపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ కొప్పుల వేనారెడ్డి పేరు ఇంచార్జ్ రేసులో తెరపైకి వచ్చింది. దామోదర్‌రెడ్డి తదనంతరం అయినా తనకు నియోజకవర్గ ఇంచార్జ్ పదవి వస్తుందని ఆశపడ్డ పటేల్‌ రమేష్ రెడ్డికి..ఈ ఇద్దరి నుంచి కాంపిటీషన్ తప్పడం లేదు. వేం నరేందర్ రెడ్డి ద్వారా పటేల్‌ రమేష్ రెడ్డి సూర్యాపేట ఇంచార్జ్ పోస్ట్ కోసం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

పటేల్ రమేష్‌రెడ్డి రెండుసార్లు పార్టీ నేతల విజ్ఞప్తితో పోటీ నుంచి విరమించుకున్నారు. ఆ సమయంలో అధిష్టానం ఆయనకు హామీ ఇచ్చిందని అంటున్నారు. దీంతో ఇప్పటికైనా పార్టీ తనను గుర్తింస్తుందన్న నమ్మకంతో ఉన్నారట రమేష్ రెడ్డి. నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఈసారి అవకాశం దక్కకపోతే ఇక తాను కాంగ్రెస్‌ పార్టీలో ఉండి లాభం లేదని సన్నిహితుల దగ్గర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట రమేష్ రెడ్డి.

పటేల్ రమేష్ రెడ్డిని దూరం పెడుతున్న ఉత్తమ్..!

అయితే సూర్యాపేట కాంగ్రెస్ ఇంచార్జ్ పోస్ట్‌ దక్కాలంటే జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్దతు తప్పనిసరి అంటున్నారు. పటేల్‌ రమేష్‌రెడ్డికి మంత్రి ఉత్తమ్‌తో గ్యాప్ ఉందట. కార్పొరేషన్ ఛైర్మన్‌ పదవి దక్కిన తర్వాత మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్తే కూడా మంత్రి ఉత్తమ్ ఆసక్తి చూపలేదని టాక్. మొదటి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డిని దూరం పెడుతున్నారట. దీంతో పటేల్ రమేష్ రెడ్డి కంటే..దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తమ్ రెడ్డి లేకపోతే దామోదర్‌రెడ్డి సన్నిహితుడు వేనారెడ్డి వైపే మంత్రి ఉత్తమ్ మొగ్గుచూపుతారని అంటున్నారు.

ఇప్పటికే సర్వోత్తమ్ రెడ్డి పేరును ముందుకు తీసుకురావడం..గాంధీభవన్ దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. పటేల్‌ రమేష్‌రెడ్డి, సర్వోత్తమ్‌రెడ్డి, వేనారెడ్డి ఈ ముగ్గురిలో ఎవరికి సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జ్ పోస్ట్ దక్కాలన్నా..జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదని ఇచ్చే అవకాశం ఉండదంటున్నారు. దామోదర్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో ఉత్తమ్ సర్వోత్తమ్ రెడ్డికి లేదా వేనారెడ్డికి మద్దతిచ్చే అవకాశాలే ఎక్కువ అంటున్నారు. ఈ సారైనా పటేల్ రమేష్ రెడ్డికి న్యాయం చేస్తారా? లేక మరోసారి త్యాగం తప్పదా అనేది చూడాలి.

Also Read: మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌కు ఎండ్‌ కార్డ్‌ పడేనా? పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది?