జగన్ కు తలనొప్పిగా మారుతున్న ఆధిపత్య పోరు

  • Published By: chvmurthy ,Published On : March 2, 2020 / 06:57 PM IST
జగన్ కు తలనొప్పిగా మారుతున్న ఆధిపత్య పోరు

Updated On : March 2, 2020 / 6:57 PM IST

ఏపీలో రాజకీయ పరిస్ధితులు వేడెక్కాయి. అటు టీడీపీ, ఇటు వైసీపీ మధ్య యుద్ధ వాతావరణమే నెలకొంది. అయితే వైసీపీ అధికారంలో ఉండటం, పార్టీలోని నేతల మధ్య గ్రూపులు ఏర్పడడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీలో ఎన్నికలకు ముందు కలిసి పనిచేసిన నేతలంతా ఇప్పుడు నేనంటే నేనే గొప్పంటూ ఆధిపత్య పోరులో బిజీ అయిపోయారు. ఎవరి మాట వినకుండా గ్రూపులు కట్టి.. మరీ రచ్చకెక్కుతున్నారు. ఇక్కడ ఎవరి స్ధాయితో సంబంధం లేకుండా జూనియర్ల నుంచి సీనియర్ల వరకూ అందరూ ఇదే తీరుగా పోటీ పడుతున్నారు.

కర్నూలు జిల్లాలో అధికార పార్టీ వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. మంత్రి అనిల్ కుమార్‌కు ఎమ్మెల్యే ఆర్థర్ వర్గీయులు హెచ్చరికలు జారీ చేశారు. నందికొట్కూరు నియోజకవర్గంలో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఒక వర్గం కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సిద్దార్థరెడ్డికి అనుకూలంగా అనిల్‌ వ్యవహరిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ వర్గీయులు మండిపడుతున్నారు. నందికొట్కూరు మార్కెట్ కమిటీ నియామకంలో ఈ వివాదం చోటు చేసుకుంది. మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారాన్ని యథాతథంగా చేయించకపోతే కర్నూలు జిల్లాలో  మంత్రి అనిల్‌కుమార్‌ను అడుగు పెట్టనివ్వమని ఆర్థర్ వర్గీయులు హెచ్చరించారు. దీంతో ఇక్కడ రెండు వర్గాల మధ్య పోరు నెలకొంది. 

మంత్రి అనిల్ కర్నూలు ఇన్‌ఛార్జిగా ఉన్నారు. ఇరు వర్గాల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరడంతో పరిస్థితులు కొంచెం గాడితప్పుతున్నాయని భావిస్తున్నారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, ఎంపీ సురేశ్‌ మధ్య పోరు సీఎం వరకు వెళ్లింది. తాజాగా నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, విడదల రజిని మధ్య విభేదాలు బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో తోట త్రిమూర్తులు విషయంలోనూ వర్గపోరు కనిపించింది. ఇప్పుడు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి, ఆయన పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలకు మధ్య ప్రతి చిన్న విషయంలో పంతాలు పెరిగిపోతున్నాయని చెబుతున్నారు. దీంతో పార్టీలో సమన్వయం లోపిస్తోందని, దీనివల్ల రాబోయే రోజుల్లో పార్టీకి నష్టం జరుగుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. 

ఇలా ఏదో ఒక ప్రాంతంలో నిత్యం ప్రజాప్రతినిధుల మధ్యనే కాకుండా జిల్లా ఇన్‌చార్జులకు, ఎమ్మెల్యేలకు, ముఖ్యనేతలకు, మధ్య విభేదాలు బయట పడుతూనే ఉన్నాయి. కొందరు ఎమ్మెల్యేలు జూనియర్లు కావడంతో ఆ నియోజవకర్గాల్లో సీనియర్లుగా ఉన్నవారు తమ పెత్తనం ఎక్కడ చెల్లదోనన్న ఆలోచనతో వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నారట. ఈ విషయంలో అధినేత జగన్‌ ప్రస్తుతానికి చూసీ చూడనట్టు ఉంటున్నా.. తొందర్లోనే రంగంలోకి దిగి మొత్తం సెట్‌ చేసేస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ ఆ పని త్వరగా చేయకపోతే పార్టీకి నష్టం వాటిల్లే పరిస్థితులున్నాయని అంటున్నాయి. లేకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని అంటున్నారు.