Hyderabad:ఊరెళ్లే దారేది : హైదరాబాద్ రోడ్లు ఖాళీ
సంక్రాంతికి పట్నం పల్లెబాట పట్టింది. ఆయినవారితో.. ఆత్మీయుల మధ్య పండగ చేసుకునేందుకు కుటుంబాలకు కుటుంబాలే తరలివెళ్తున్నాయి. దీంతో... బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటికిటలాడుతున్నాయి.

Hyderabad Roads
Hyderabad::సంక్రాంతికి పట్నం పల్లెబాట పట్టింది. ఆయినవారితో.. ఆత్మీయుల మధ్య పండగ చేసుకునేందుకు కుటుంబాలకు కుటుంబాలే తరలివెళ్తున్నాయి. దీంతో… బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటికిటలాడుతున్నాయి. ఇక నిమిష నిమిషానికి హైవేలపై రద్దీ పెరిగిపోతోంది. టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. వాహనదారులకు ఇబ్బందులు పెరిగిపోయాయి. సిటీ జనం పల్లె బాటపట్టడంతో హైదరాబాద్ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.
ఊరికి వెళ్లాల్సిందే
సంక్రాంతి అంటేనే తెలుగువారికి ముఖ్యమైన, పెద్ద పండగ సంక్రాంతి. సొంతూళ్లో పండుగ జరుపుకోవాలని అంతా ఆశపడతారు. మరీ ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాళ్లు. ఏపీలో సంక్రాంతి పండగని చాలా గ్రాండ్‌గా చేసుకుంటారు. ఏ పండక్కి వెళ్లినా, వెళ్లకపోయినా సంక్రాంతికి మాత్రం కచ్చితంగా సొంతూరుకు వెళ్తారు. అదనపు ఛార్జీల భారం భరించడానికి కూడా వెనుకాడరు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఊరికి వెళ్లాల్సిందే. కొందరు ముందే రిజర్వేషన్లు చేసుకున్నా మరికొందరు మాత్రం స్పెషల్ బస్సులు, ట్రైన్లను ఆశ్రయించారు. లక్షల సంఖ్యలో నగరవాసులు సొంతూళ్లకు బయల్దేరారు.
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిట
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లతో పాటు జేబీఎస్, ఎంజీబీఎస్ ఆర్టీసీ బస్టాండ్లు జనసంద్రంగా మారాయి. మెయిన్ జంక్షన్లలోని బస్టాపులు కూడా… రద్దీగా ఉన్నాయి.
టోల్ ప్లాజాల వద్ద విపరీతమైన రద్దీ
బస్సులు, ట్రైన్లే కాకుండా… సొంత వాహనాల్లో ప్రయాణంతో… హైదరాబాద్ చుట్టుపక్కల రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ నుంచి ఇటు అనంతపురం వరకు.. అటు విజయవాడ వరకు ఉన్న అన్ని టోల్ ప్లాజాల దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయింది. ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడింది. వేలాది వాహనాలు ఒకే సారి రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ జాం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.
ఛార్జీలకు రెక్కలు
మరోవైపు… పండక్కి సొంతూళ్లకు వెళ్తున్న వారి సంఖ్య విపరీతంగా ఉండటంతో చార్జీలకు ఊహించని స్థాయిలో రెక్కలొచ్చాయి. అధిక చార్జీలు వసూలు చేస్తూ ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు అందినకాడికి దోచుకుంటున్నాయి. దీనికి తాము కూడా మినహాయింపు కాదంటూ రైల్వే, రోడ్డు రవాణా సంస్థలు రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నాయి. అయితే… డిమాండ్‌కు తగ్గట్లుగా బస్సులు, ట్రైన్లను సర్దుబాటు చేయకపోవడంతో ఎక్కువ మంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
Read More : అక్కడికే వస్తా..తేల్చుకుందాం..ఖాకీలకు పవన్ వార్నింగ్