చక్రం తిప్పుతారా : మంగళగిరి నుంచి లోకేష్ పోటీ!

  • Published By: vamsi ,Published On : March 12, 2019 / 06:51 AM IST
చక్రం తిప్పుతారా : మంగళగిరి నుంచి లోకేష్ పోటీ!

తెలుగుదేశం పార్టీ యువనేత, చంద్రబాబు తనయుడు నారాలోకేష్ ఏ స్థానం నుండి పోటీ చేస్తారు అనే విషయంపై టీడీపీ క్లారిటీకి  వచ్చినట్లు తెలుస్తుంది. రాజధాని ప్రాంతమైన మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయించేందుకు టీడీపీ సిద్ధమైంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు లోకేష్.

దొడ్డిదారిలో మంత్రి అయ్యాడంటూ విమర్శలు వస్తున్న తరుణంలో అసెంబ్లీ నుంచి పోటీ చేయించాలని టీడీపీ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీమిలీ నుంచి పోటీ చేస్తారని ఒకసారి.. పెదకూరపాడు నుంచి పోటీ చేస్తాడని మరోసారి వార్తలు వచ్చాయి. చివరకు మంగళగిరి నుంచి పోటీకి లోకేష్ సిద్ధమైనట్లు చెబుతున్నారు. రాజధాని ప్రాంతం కావడం.. టీడీపీకి పట్టు ఉన్న నియోజకవర్గం కావడంతో ఈసారి ఎలాగైనా ఈ స్థానం గెలుచుకోవాలని టీడీపీ పట్టుదలగా ఉంది.

2014 ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగి ఓటమిపాలైన గంజి చిరంజీవి ఈసారి టికెట్ ఆశిస్తున్నప్పటికీ.. అతనికి ఇవ్వకుండా వేరొకరిని నిలబెడితే ఇబ్బంది అని భావించి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నియోజకవర్గంలో మరో ముఖ్య నేత, మాజీ ఎమ్మెల్యే అయిన కాండ్రు కమల కూడా తెలుగుదేశంలో చేరారు. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి ఆళ్ల రామకృష్ణా రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సీటు ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ సీటు కావడం..  తొలిసారి లోకేశ్ పోటీ చేయబోయే ఎన్నిక కావడంతో.. ఆయన పోటీపై ఆసక్తి నెలకొంది.