ఉపఎన్నికల వేళ దుబ్బాకలో టీఆర్‌ఎస్‌కు షాక్, కాంగ్రెస్‌లోకి చెరుకు శ్రీనివాస్ రెడ్డి

cheruku srinivas reddy: ఉపఎన్నికల వేళ దుబ్బాకలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు షాక్ తగిలింది. చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. గత ఎన్నికల సమయంలో తండ్రి ముత్యంరెడ్డితో పాటు టీఆర్‌ఎస్‌లో చేరారు శ్రీనివాస్‌రెడ్డి. దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ టికెట్ ఆశించిన శ్రీనివాస్‌రెడ్డి భంగపడ్డారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించారు. కాసేపట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు. కాగా, శ్రీనివాస్‌రెడ్డినే దుబ్బాక అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించనుంది.
నవంబర్ 3న పోలింగ్, 10న ఫలితాలు:
ఇటీవలే దుబ్బాకలో ఎన్నికల నగారా మోగింది. దుబ్బాక ఉపఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దుబ్బాకతో పాటు దేశవ్యాప్తంగా 54 అసెంబ్లీ నియోజవకర్గాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 3న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. దుబ్బాక ఉపఎన్నికకు సంబంధించి అక్టోబర్ 9న నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 16. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 19 వరకు గడువు ఉంటుంది.
ఇప్పటికే ఎన్నికల బరిలోకి దిగేందుకు ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ సిద్ధమయ్యాయి. అభ్యర్థుల వేటలో నేతలు నిమగ్నమయ్యారు. మరోవైపు ప్రచారం హోరెత్తుతోంది. తాజాగా షెడ్యూల్ రావడంతో మరింత దూకుడు పెంచారు.
టీఆర్ఎస్ అభ్యర్థి భార్యా? కుమారుడా?
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక ఉపఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ్ సీట్ కావడంతో.. దుబ్బాక తమదే అనే ధీమా టీఆర్ఎస్‌లో కనిపిస్తోంది. ఇప్పటికి అభ్యర్థిని ఖరారు చేయకున్నా.. అధిష్టానం ఎవరిని నిలబెట్టినా.. గెలిపించుకునేందుకు పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. అయితే.. టీఆర్‌ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాత పోటీ చేస్తారని ప్రచారం ఉంది.
కొద్దిరోజుల కిందటి వరకు సుజాతకే సీటివ్వాలని భావించారు గులాబీ బాస్ కేసీఆర్. కాగా, రామలింగారెడ్డి కుమారుడు కూడా టికెట్ ఆశిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి సెంటిమెంట్ ప్రకారం రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి టీఆర్ఎస్ సెంటిమెంట్ పాటిస్తుందో లేదో చూడాలి. ఇక బీజేపీ హైకమాండ్ పేరును ఖరారు చేయకముందే రఘునందన్ రావు ప్రచారంలో మునిగిపోయారు. కాంగ్రెస్ తరఫున నలుగురైదుగురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఫైర్ బ్రాండ్ విజయశాంతి పేరు కూడా వినిపిస్తోంది.
కలకలం రేపుతున్న రామలింగారెడ్డి కుమారుడి ఆడియోలు:
రామలింగారెడ్డి కుమారుడి ఆడియోలు కొన్నిరోజులుగా కలకలం రేపుతున్నాయి. దీంతో టీఆర్ఎస్ అధిష్టానం సీటు విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి కూడా టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయన టీఆర్ఎస్ కు ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించారు.