ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే, కర్నూలు వైసీపీలో ఆధిపత్య పోరు

గడచిన రెండు ఎన్నికల్లోనూ కర్నూలు జిల్లా ప్రజలు వైసీపీకే అత్యధిక స్థానాలు కట్టబెట్టారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలైతే మంచి మెజారిటీ ఇచ్చారు. జగన్‌పై అభిమానంతో పాటు నగరంలో వైసీపీకి బలమైన కిందిస్థాయి కేడర్ ఉండటంతో కర్నూలు నియోజకవర్గం కంచుకోటగా మారింది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొంది టీడీపీలోకి వెళ్లిన ఎస్వీ మోహన్ రెడ్డి స్థానంలో 2019 ఎన్నికల్లో హఫీజ్ ఖాన్‌కు వైసీపీ టికెట్ ఇవ్వడంతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. హఫీజ్ ఖాన్ గెలుపు కోసం గత ఎన్నికల్లో ఎస్వీ మోహన్ రెడ్డి పని చేసినా ఎన్నికల అనంతరం వీరి మధ్య అంతరం పెరిగిందంటున్నారు. ఎవరికి వారే సొంతంగా నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
మూడో వర్గంగా ఏర్పడిన రాజా విష్ణువర్ధన్ రెడ్డి, సురేందర్‌రెడ్డి:
హఫీజ్‌ఖాన్, ఎస్వీ మోహన్‌రెడ్డికి తోడు మొదటి నుంచి వైసీపీ జెండాను నియోజకవర్గంలో మోసిన ద్వితీయశ్రేణి నాయకులు నేడు మూడో వర్గంగా ఏర్పడి తమ కార్యకలాపాలను ఇద్దరి ప్రమేయం లేకుండా కొనసాగిస్తున్నారట. న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటిస్తూ గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో హఫీజ్ ఖాన్ వర్గం, ఎస్వీ మోహన్ రెడ్డి వర్గం, ద్వితీయశ్రేణి నాయకులు వేర్వేరుగా సంబరాలను నిర్వహించడం చర్చనీయాంశం అయ్యింది. పార్టీ నగర అధ్యక్షుడు రాజా విష్ణువర్ధన్ రెడ్డి, పార్టీ అదనపు కార్యదర్శి తెర్నేకల్ సురేందర్రెడ్డి, తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందోనన్న అనుమానంతో మూడో వర్గంగా మారి సొంతంగా పార్టీ కార్యకలాపాలు చేయడం మొదలుపెట్టారట.
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య విభేదాలు తారస్థాయికి:
ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డిల మధ్య గడచిన ఏడాది కాలంగా విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఎవరికే వారే కార్యక్రమాల నిర్వహణతో పాటు నియోజకవర్గంలో నువ్వా.. నేనా అన్న విధంగా పోటీపడుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్న సంకేతాలు అందడంతోనే వైసీపీ నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దయ్య, మైనార్టీ నాయకులు హసిఫ్, సురేశ్ మూడో ప్రత్యామ్నాయంగా రంగంలోకి దిగారని అంటున్నారు.
కొత్తవారికి, ఆర్థికంగా బలంగా ఉన్న వారికే కాంట్రాక్ట్ పనులు, నామినేటెడ్ పోస్టులు:
నగర వైసీపీలో కష్టపడి పనిచేసిన కేడర్‌ను పక్కనపెట్టి కొత్తగా వచ్చిన వారికి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అందలం ఎక్కిస్తున్నారన్న ఆక్రోశం పార్టీ సీనియర్ నాయకులలో అధికంగా ఉంది. ఇటీవల నగరంలోని వివిధ వార్డులలో కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు సీనియర్ నాయకులు ముందుకు రాగా, కొత్తగా వచ్చిన వారికి, ఆర్థికంగా బలంగా ఉన్నవారికి మాత్రమే టికెట్ల కేటాయింపు జరిగిందన్న విమర్శలున్నాయి. కాంట్రాక్టు పనులు, నామినేటెడ్ పోస్టుల వ్యవహారంతో పాటు సీనియర్ నాయకులకు పార్టీలో సముచిత స్థానం లేదన్న బలమైన వాదనను ద్వితీయశ్రేణి నాయకులు వినిపిస్తున్నారు. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లాలని భావిస్తున్నారు.
కర్నూలు నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు జిల్లా ఇన్‌చార్జితో పాటు పార్టీ పెద్దలకు ఫిర్యాదులు అందుతున్నాయి. పార్టీ బలంగా ఉన్నప్పటికీ గ్రూపుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. మరి ఈ గ్రూపులను సెట్ చేసి అందరినీ ఒకటిగా చేసేందుకు అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిందే.