భావోద్వేగంలో చెప్పుతీసి టేబుల్ పై పెట్టిన పృధ్వీ

ఎస్వీబీసీ ఉద్యోగినితో అసభ్యంగా మాట్లాడినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో కారణంగా రాజీనామా చేసిన చైర్మన్ పృధ్వీ ఆవిషయమై వివరణ ఇచ్చారు. చైర్మన్ పదవికి రాజీనామా చేసిన అనంతరం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన…. తనను దెబ్బతీసేందుకు కొంతమంది అనేక రకాలుగా ప్రయత్నించారని ఆరోపించారు. మిమిక్రీ ఆర్టిస్టుతో ఫేక్ వాయిస్ ద్వారా తనపై దుష్ప్రచారం చేశారని, తాను మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చాడు.
పద్మావతి గెస్ట్‌హౌస్‌లో మందు తాగానని దుష్ప్రచారం చేశారని …. తనకు మందుతాగే అలవాటు లేదని, పద్మావతి గెస్ట్‌హౌస్‌లో తాగానని నిరూపితమైతే ఈ చెప్పుతో కొట్టండని తన కాలికి ఉన్న చెప్పును తీసి మీడియా మైకుల ముందు పృథ్వీ పెట్టడంతో విలేకరులు విస్తుపోయారు. పండుగ పూటా తనపై ఇలాంటి ఆరోపణలు రావటంతో తన కుటుంబం, స్నేహితులు ఎంతో బాధపడ్డారని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్వీబీసీ ఉద్యోగులతో స్నేహంగా ఉంటానని, తనకు ఒక ఐడీ కార్డు ఇవ్వండి వర్కింగ్ చైర్మన్ గా మీతో కలిసి పనిచేస్తానని చెప్పానని అన్నారు. తాను తాగలేదని, ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమని పృథ్వీ ప్రకటించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తానని, తనను దెబ్బ తీయటానికి అనేక రకాలుగా ప్రయత్నించారని…తిరుమలలో అన్యమత ప్రచారాన్ని ఖండించానని పృథ్వీ చెప్పుకొచ్చారు. ఇప్పుడింక తాను పదవిలో లేనని రేపటి నుంచి కడిగిపారేస్తానని.. మద్యం తాగినట్లు రుజువైతే చెప్పుతో కొట్టండని పృధ్వీ అన్నారు.
నేను శబరిమల నుంచి తిరిగి వచ్చేటప్పుడు నాకు ఒక జర్నలిస్టు మిత్రుడు చెప్పారని..తనపై కుట్ర జరుగుతోందని హెచ్చరించినట్లు పృధ్వీ తెలిపారు. తాను వెంకటేశ్వరస్వామిని నమ్మిసేవ చేస్తున్నానుకాబట్టి నాకు ఏమీ కాదనే ధైర్యంతోఉన్నానని కానీ ఇంతలా దెబ్బ కొడతారని అనుకోలేదని ఆయనబాధపడ్డారు.
నేను ఎవరికీ ఎప్పుడూ అన్యాయం చేయలేదని.. గడిచిన 9 నెలల్లో ఎస్వీబీసీ లో ఏ ఒక్క ఉద్యోగిని తొలగించలేదని… వెంకట రెడ్డి అనే ఉద్యోగి ప్రవర్తన బాగోలేక పోవటంతో విధినిర్వహణలో భాగంగానే హైదరాబాద్ వెళ్లి పనిచేయమని ఆదేశించానని చెప్పారు.