సార్ విధుల్లో చేరుతాం : డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికుల క్యూ

ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాలు చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ వారంతా సమ్మెలోకి వెళ్లారు. ఎన్ని రోజులయినా..ఎలాంటి పరిష్కారం కాలేదు. సమస్యల పేరిట నినదించిన ఆ గొంతులు నేడు తమను విధుల్లోకి తీసుకోవాలంటూ కోరుతున్నాయి. 48 రోజులుగా నినాదాలు, ధర్నాలు, నిరసనలతో దద్దరిల్లిన నగరంలోని ఆర్టీసీ డిపోలు కార్మికుల అభ్యర్థనలకు వేదికలుగా మారాయి.
రెండు నెలలుగా వేతనాలు లేకుండా సమ్మెలో కొనసాగుతున్న కార్మికులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని జేఏసీ ప్రతిపాదించింది. దీంతో విధుల్లో చేరతామంటూ 2019, నవంబర్ 21వ తేదీ గురువారం వివిధ డిపోలకు కార్మికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాశారు.
అయితే, ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు ఎవరినీ విధుల్లోకి తీసుకోవద్దని, విధుల్లో చేరేందుకు సిద్ధమంటూ లేఖలు ఇచ్చినా కూడా తీసుకోవద్దని డిపో మేనేజర్లకు అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు ఎవరినీ విధుల్లోకి చేర్చుకోవడం సాధ్యం కాదని మేనేజర్లు వారికి చెప్పి పంపించేశారు. ఇప్పటికే 29 మంది కార్మికులు చనిపోయినందున మానవతా దృక్ఫథంతో వారిని విధుల్లోకి చేర్చుకునే విషయంలో నిర్ణయం తీసుకోవాలని జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ యాజమాన్యం తమను విధుల్లోకి చేర్చుకుంటుందా ? లేదా అనుమానాలు కార్మికులను కలవరపెడుతున్నాయి. లేబర్ కోర్టు ఎలాంటి పాత్ర పోషిస్తుంది ? ప్రభుత్వంతో పాటు యాజమాన్యానికి నచ్చచెప్పి తమ ఉద్యోగాలను కాపాడుతుందా ? సమ్మె కాలానికి జీతం ఇస్తారా ? ఇలాంటి ఎన్నో సందేహాలు వారి మదిని తొలిచి వేస్తున్నాయి.
Read More : మరో ముందడుగు : మైండ్ స్పేస్ జంక్షన్ మార్గంలో మెట్రో రైలు