టీఆర్ఎస్‌లో ఆ ఇద్దరు యువ ఎమ్మెల్యేలు ఎక్కడ?

తెలంగాణ ఉద్యమ సమయం నుంచి గులాబీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన యువకులుగా గుర్తింపు పొందారు వారిద్దరూ. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వారికి పార్టీలో ప్రాధాన్యం దక్కింది. ఇద్దరు నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికల్లో విజయం సాధించి పార్టీలో ముఖ్య నేతలుగా గుర్తింపు పొందారు. వారే బాల్క సుమన్, జీవన్‌రెడ్డి.
ఈ ఇద్దరు నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులందరితో కలిసిపోయెంత చనువు కూడా ఉంది. ఇదే చనువుతో రాజకీయాల్లో అతి తక్కువ కాలంలోనే ఓ వెలుగు వెలిగారనే చర్చ పార్టీలో ఉంది. ప్రస్తుతం వారిద్దరూ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నా ప్రగతి భవన్‌కు దూరంగా ఉండటంపై ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి.
నియోజకవర్గాలకే పరిమితమై :
ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ఆర్మూరు, ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జీవన్‌రెడ్డి, సుమన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అత్యంత సన్నిహితులనే ముద్ర ఉంది. తొలివిడత ప్రభుత్వం ఏర్పాటైనప్పుడే వీరిద్దరిలో ఒకరైన జీవన్‌రెడ్డికి ప్రగతి భవన్ డోర్ క్లోజ్ కాగా… రెండో విడతలో మరో నేత బాల్క సుమన్ వంతు వచ్చిందని పార్టీలో టాక్ మొదలైంది.
కేటీఆర్ అనుంగు అనుచరులుగా గుర్తింపు పొందిన వీరిద్దరు ఇప్పుడు తమ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమవుతున్నారట. సీఎం కేసీఆర్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా మంత్రి పదవులు ఖాయమని ఈ ఇద్దరు నేతలు అంచనా వేసుకున్నారు.
ప్రగతి భవన్ దూరం పెట్టిందా? :
కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తాము కచ్చితంగా కేబినెట్‌లో ఉంటామన్న ధీమాను ఇద్దరు నేతలు బహిరంగంగానే వ్యక్తం చేశారు. కానీ కేటీఆర్ వెంట మాత్రం ఆ ఇద్దరు ఇప్పుడు దర్శనమివ్వడం లేదట. ప్రగతిభవన్‌లో కూడా బొత్తిగా కనిపించడమే మానేశారు. అసలు ప్రగతి భవన్‌తో వీరికి ఉన్న సంబంధాల్లో తేడా వచ్చిందా.. మరేదైనా కారణాలు ఉన్నాయా అనే విషయం మీదనే ఇప్పుడు చర్చంతా సాగుతోంది.
సుమన్ మాత్రం ముఖ్యమంత్రిగా కేటీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టే వరకు విందులకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట. రాబోయే రోజుల్లో కాబోయే మంత్రులం అనుకునేలా ఈ ఇద్దరు నేతలు వ్యవహరించడం వల్లే ప్రగతి భవన్ దూరం పెట్టిందనే ప్రచారం కూడా ఉంది. మరి భవిష్యత్తులో అయినా పరిస్థితులు మారతాయేమోనని వారిద్దరూ ఎదురు చూస్తున్నారంటున్నారు.