Ayodhya Ram Temple : అయోధ్య రామునికి భారీగా విరాళాలు.. నెల వ్యవధిలోనే రూ.25 కోట్లు!

Ayodhya Ram Temple : గత జనవరి నుంచి అయోధ్య రామమందిర దర్శనానికి భారీగా భక్తజనం తరలివస్తోంది. దాదాపు 60 లక్షల మంది భక్తులు దర్శించుకోగా.. అదే నెలలో రూ.25 కోట్ల విరాళాలు అందినట్టు ఆలయ ట్రస్ట్ వెల్లడించింది.

Ayodhya Ram Temple : అయోధ్య రామునికి భారీగా విరాళాలు.. నెల వ్యవధిలోనే రూ.25 కోట్లు!

Ayodhya's Ram Temple Receives Rs. 25 Crore Donations In A Month

Updated On : February 24, 2024 / 11:03 PM IST

Ayodhya Ram Temple : అయోధ్యలో విగ్రహప్రతిష్ఠాపన కార్యక్రమం అనంతరం రామమందిరానికి పెద్దఎత్తున భక్తులు తరలివస్తున్నారు. జనవరి 23 నుంచి దాదాపు 60 లక్షల మంది భక్తులు బాల రాముడిని దర్శించుకున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. అయితే, బాలరాముడిని దర్శించుకున్న భక్తుల్లో ఎక్కువగా బంగారం, వెండి అభరణాలను కానుకగా సమర్పిస్తున్నారు. నెలరోజుల వ్యవధిలో అయోధ్య బాల రాముడికి భారీగా విరాళాలు అందాయని రామాలయం ట్రస్ట్ కార్యాలయం ఇన్‌ఛార్జ్ ప్రకాష్ గుప్తా చెప్పారు.

Read Also : Bhimaa : మొన్న హనుమాన్.. ఇప్పుడు భీమా.. రేపు కల్కి.. ఆ పాయింట్‌తో సినిమాలు!

విరాళాల్లో 25 కిలోల బంగారం, వెండి ఆభరణాలతో కలిపి ఒక నెలలో సుమారు రూ. 25 కోట్ల విరాళాలు అందాయని ట్రస్ట్ పేర్కొంది. రూ. 25 కోట్ల మొత్తంలో చెక్కులు, డ్రాఫ్ట్‌లు, ఆలయ ట్రస్ట్ కార్యాలయంలో జమ చేసిన నగదుతో పాటు విరాళాల్లో జమ చేసినవి ఉన్నాయి. ట్రస్ట్ బ్యాంకు ఖాతాలలో నేరుగా జరిగే ఆన్‌లైన్ లావాదేవీలపై లెక్కలు తేలాల్సి ఉందని ఆయన చెప్పారు.

60లక్షల మంది భక్తుల దర్శనం :
గత నెల 23 నుంచి ఇప్పటివరకు 60 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని గుప్తా తెలిపారు. శ్రీరామ జన్మభూమి రామమందిర దర్శనానికి వచ్చిన భక్తులు ఆలయం వినియోగించలేని వెండి, బంగారంతో చేసిన వస్తువులను రామ్‌లల్లాకు విరాళంగా ఇస్తున్నారని, అయితే భక్తుల భక్తిని దృష్టిలో ఉంచుకుని రామమందిరం ట్రస్టు ఆభరణాలు, ఇతర వస్తువులను స్వీకరిస్తోంది. బంగారం, వెండితో చేసిన వస్తువులే ఎక్కువగా ఉంటున్నాయని ప్రకాష్ గుప్తా పేర్కొన్నారు.

రామనవమి సందర్భంగా భారీగా పెరగనున్న విరాళాలు :
అయోధ్యలో సుమారు 50 లక్షల మంది భక్తులు హాజరయ్యే రామ నవమి పండుగ రోజుల్లో విరాళాలు పెరుగుతాయని ఆలయ ట్రస్ట్ భావిస్తున్నట్లు తెలిపారు. రామనవమి సందర్భంగా భారీ మొత్తంలో విరాళాలు వచ్చే అవకాశం ఉందని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రామజన్మభూమిలో నాలుగు ఆటోమేటిక్ హైటెక్ కౌంటింగ్ మెషీన్లను ఏర్పాటు చేసిందని గుప్తా తెలిపారు. రసీదులను జారీ చేయడానికి ట్రస్ట్ ద్వారా డజను కంప్యూటరైజ్డ్ కౌంటర్లు, రామాలయం ట్రస్ట్ ద్వారా ఆలయ ప్రాంగణంలో అదనపు విరాళాల హుండీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. త్వరలో ఆలయ ప్రాంగణంలో అన్ని సౌకర్యాలతో కూడిన కౌంటింగ్ రూమ్ నిర్మిస్తామని గుప్తా తెలిపారు.

ఎస్బీఐ, ట్రస్ట్ మధ్య ఒప్పందం :
భక్తులు కానుకగా సమర్పించిన బంగారం, వెండి ఆభరణాలు, విలువైన వస్తువుల మదింపు కోసం వాటిని కరిగించడం, నిర్వహణను భారత ప్రభుత్వ టంకశాలకు అప్పగించినట్లు రామాలయ ట్రస్ట్ ట్రస్టీ అనిల్ మిశ్రా తెలిపారు. అంతేకాదు.. ఎస్బీఐ, ట్రస్ట్ మధ్య ఒప్పందం కూడా కుదిరినట్టు మిశ్రా చెప్పారు. ఎంఓయూ ప్రకారం.. విరాళాలు, సమర్పణలు, చెక్కులు, డ్రాఫ్ట్‌లు, నగదు సేకరణ పూర్తి బాధ్యతను ఎస్‌బీఐ తీసుకుంటుందని, వాటిని బ్యాంకులో జమ చేస్తామన్నారు. విరాళంగా ఇచ్చిన నగదును ప్రతిరోజూ రెండు షిఫ్టులలో లెక్కించడం జరుగుతుందని మిశ్రా పేర్కొన్నారు.

Read Also : CBSE Boards Exam 2024 : పరీక్షల ఒత్తిడిని తగ్గించుకోవడానికి విద్యార్థులకు సీబీఎస్ఈ సూచనలు.. ఏం చేయాలి? ఏం చేయకూడదంటే?