Tirumala : తిరుమలలో మార్చి 29న బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 29వ తేదీన మంగ‌ళ‌వారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జరుగుతుంది.

Tirumala : తిరుమలలో మార్చి 29న బ్రేక్ దర్శనాలు రద్దు

Koil Alwar Tirumanjanam

Updated On : March 26, 2022 / 3:28 PM IST

Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 2న శుభ‌కృత్ నామ సంవ‌త్స‌ర ఉగాది ఆస్థానం జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో మార్చి 29వ తేదీన మంగ‌ళ‌వారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు.  ఈ సందర్భంగా ఆ రోజు బ్రేక్ దర్శనాలు రద్దు చేయడమైనదని టీటీడీ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో మార్చి 28వ తేదీ సోమవారం సిఫారసు లేఖలు స్వీకరించబడవని టీటీడీ పేర్కోంది.ఈ విషయాన్ని భక్తులు గమనించి టీటీడీకి సహకరించాలని కోరడమైనది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం రోజున ఉదయం 6 నుండి 11 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు.

Also Read : Annamacharya : మార్చి 28 నుండి అన్నమయ్య వర్ధంతి కార్యక్రమాలు

ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేస్తారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.